Telangana Alcohol Consumption : హైదరాబాద్: మద్యం వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఏకంగా 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు NFHS-6 సర్వే గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఇదే వయసు పురుషుల్లో మద్యం వినియోగం సగటు 18.9 శాతంగా ఉండగా.. తెలంగాణలో నమోదైన శాతం దానికి రెండింతలకు పైగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలు రాష్ట్రంలో మద్యం వినియోగం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి.
NFHS-6 గణాంకాల ప్రకారం.. మద్యం వినియోగంలో తెలంగాణ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 42.2 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు నమోదైంది. 38.3 శాతంతో ఛత్తీస్‌గఢ్ మూడో స్థానంలో ఉండగా.. 33.6 శాతంతో జార్ఖండ్ నాలుగో స్థానంలో, 26.9 శాతంతో మధ్యప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచాయి. ఈ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం వినియోగం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
గ్రామాల్లోనే ఎక్కువ
తెలంగాణలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం అధికంగా ఉండటం మరో కీలక అంశంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం వినియోగం 36.3 శాతంగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 46.6 శాతంగా నమోదైంది. అంటే నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సేవించే వారి శాతం దాదాపు 10 శాతం పాయింట్లు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యలు మరింత అవసరమనే చర్చకు ఈ గణాంకాలు దారితీస్తున్నాయి.
మహిళల్లోనూ వినియోగం
మద్యం వినియోగం పురుషులకు మాత్రమే పరిమితం కావడం లేదని NFHS-6 గణాంకాలు సూచిస్తున్నాయి. మహిళల్లోనూ మద్యం సేవించే వారి శాతం నమోదైంది. తెలంగాణలో మహిళల మద్యం వినియోగం 7.1 శాతంగా ఉండగా.. ఈ విభాగంలో రాజస్థాన్ 19.9 శాతంతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ 7.1 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లో 5.7 శాతం, జార్ఖండ్‌లో 5.5 శాతం, మధ్యప్రదేశ్‌లో 1.6 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
మొత్తంగా చూస్తే తెలంగాణలో పురుషుల్లో మద్యం వినియోగం జాతీయ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉండటం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మరింత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. మహిళల్లోనూ వినియోగం పెరుగుతున్నట్లు కనిపించడం మరో ముఖ్య పరిణామం. మద్యం అధికంగా తీసుకోవడం కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, సామాజిక జీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. ఈ గణాంకాల నేపథ్యంలో మద్యం వినియోగ నియంత్రణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.