Lemon Prices: దిష్టి పోవాలని గుమ్మానికి నిమ్మకాయలు కడతాం. కడుపులో గడబిడగా ఉంటే చల్లటి నీళ్లలో నిమ్మరసం.. చక్కెర లేదా బెల్లం కలుపుకొని తాగుతాం.. వేడివేడి బిర్యానీ తింటుంటే.. ఘాటు తగ్గాలని నిమ్మకాయ పిండుకొని లాగించేస్తూ ఉంటాం. ఇక్కడితోనే ఆగిపోతామా.. ఇప్పుడు శ్రావణమాసం.. అమ్మవారికి దండవేయడానికి.. లేదా అమ్మవారికి సమర్పించడానికి నిమ్మకాయలను వాడుతుంటాం.
సహజంగా అయితే నిమ్మకాయలకు ఎండాకాలంలో ధర ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయల వినియోగం ఎండకాలంలో అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో వేడి.. ఉక్క పోత అధికంగా ఉంటుంది. శరీరం నుంచి చెమట అధికంగా వెళుతుంది. అలాంటప్పుడు శరీరానికి శక్తి కావాలి. తక్షణమే లవణాలు కావాలి. ఇది జరగాలంటే శరీరంలోకి నిమ్మరసం ఏదో ఒక రూపంలో వెళ్లాలి. ఎందుకంటే నిమ్మరసంలో విటమిన్ సి.. ఇంకా కీలకమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి తక్షణమే శక్తినిస్తాయి. కోల్పోయిన లవణాలను తిరిగి ఇస్తాయి. శరీరాన్ని సమతులమైన స్థితిలో ఉంచుతాయి.
ఇక ప్రస్తుతం నిమ్మ ధరలు బంగారంతో సరితూగుతున్నాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. దీనికి తోడు దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగానే నిమ్మ ధరలు బహిరంగ మార్కెట్లో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకరకంగా బంగారంతో తూగుతున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో గత మంగళవారం 8 కిలోల బస్తా ఏకంగా 12 వేల వరకు పలికింది. ప్రస్తుతం ఈ ధర ఏకంగా 16 వేలకు చేరింది. వారం రోజుల్లోనే నాలుగు వేలకు ఎగబాకింది. ప్రస్తుతం నిమ్మకాయలు కిలో ధర 240 వరకు పలుకుతున్నాయి. శ్రావణమాసంలో డిమాండ్ పెరగడం.. ఈ ఏడాది సరిగ్గా వర్షాలు లేకపోవడంతో దిగుబడి తగ్గడం వల్ల ధరల్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో ఇలా ఉంటే..తెలంగాణలో ధర మరింత అధికంగా ఉంది. డిమాండ్ కూడా అదేస్థాయిలో ఉంది. పైగా తెలంగాణలో నిమ్మకాయల ఉత్పత్తి అంతంతమాత్రమే.
నిమ్మకాయల ధరలు ఇప్పుడే ఇలా ఉంటే.. వచ్చే రోజుల్లో.. ముఖ్యంగా ఎండాకాలంలో ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయం వేస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.. వానాకాలంలో కూడా ఎండలు విపరీతంగా ఉండడంతో నిమ్మకాయలు విపరీతంగా వాడుతున్నారని.. నిమ్మరసం వాడే వారి సంఖ్య పెరిగిపోతుందని.. అందువల్లే ధర ఈ స్థాయిలో ఉందని వ్యాపారులు అంటున్నారు. ఎండాకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలు తీరాలంటే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం ఒకటే మార్గమని వ్యాపారులు భావిస్తున్నారు.