Pratyusha Case: రెండు దశాబ్దాల కిందట సంచలనం సృష్టించింది నటి ప్రత్యూష( actor Pratyusha) కేసు. అప్పట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెను రేప్ చేసి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. కానీ విచారణలో మాత్రం అటువంటిదేమీ లేకుండా పోయింది. ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిపి అప్పట్లో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా ప్రత్యూష చనిపోయారు. సిద్ధార్థ రెడ్డి మాత్రం బతికారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఇదో సంచలన ఘటన. ఎందుకంటే నటిగా ప్రత్యూష వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బుల్లితెరపై మెరిసిన ప్రత్యూష అనతి కాలంలోనే తెలుగు సినిమాల్లోకి ప్రవేశించారు. ఐదేళ్లలో 11 సినిమాల్లో నటించారు. స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న క్రమంలో 2002 ఫిబ్రవరి 23న ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే తాను మరణించి.. ప్రేమికుడు సిద్ధార్థ రెడ్డి బతికి బయటపడేసరికి ఈ కేసు వెనుక కుట్ర కోణం ఉందని.. రేప్ చేసి చంపేసారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
* స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో
ప్రత్యూష ది భువనగిరి( Bhuvanagiri) ప్రాంతం. బుల్లితెరపై తొలుత గుర్తింపు సాధించారు. తరువాత సినిమాల్లోకి వచ్చారు. ఇంటర్ చదువుకున్న సమయంలోనే సిద్ధార్థ రెడ్డిని ప్రేమించారు. నటిగా మారిన తర్వాత కూడా వారి ప్రేమాయణం నడిచింది. అయితే ఉన్నఫలంగా వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కానీ దురదృష్టవశాత్తు ప్రత్యూష చనిపోయారు. ఆ సమయానికి ఆమె వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. అప్పట్లో స్టార్ హీరోయిన్ కావడంతో అప్పటి ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. అయితే ఆమెపై లైంగిక దాడి చేసి చంపి ఉంటారన్న అనుమానాల నేపథ్యంలో ముగ్గురు వైద్యుల బృందం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించింది. లైంగిక దాడి జరగలేదని నిర్ధారించింది. అయితే ప్రత్యూష ఆత్మహత్యకు పురిగొలిపే విధంగా వ్యవహరించాడని అభియోగాల మోపుతూ సిద్ధార్థ రెడ్డి పై కేసు నమోదు అయింది. దీంతో అప్పట్లో జిల్లా సెషన్స్ కోర్టు ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా రెండేళ్లకు జైలు శిక్ష కుదిస్తూ తీర్పు చెప్పింది న్యాయస్థానం.
* తీర్పు రిజర్వ్..
మరోవైపు తాను తప్పు చేయలేదని సిద్ధార్థ రెడ్డి( Siddharth Reddy ) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సైతం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిందితుడు సిద్ధార్థ రెడ్డి జైలు శిక్షను పెంచాలని ఆ పిటిషన్ లో కోరారు. దీనిపై గత కొన్నేళ్లుగా వాదనలు జరుగుతున్నాయి. బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. తీర్పును రిజర్వులో పెడుతూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆందోళనతో ఉభయపక్షాలు ఉన్నాయి. మరోవైపు నటి ప్రత్యూష విషాదాంతం ఆ కుటుంబానికి తీరని లోటే.