YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డేంజర్ గేమ్ ఆడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఉండకూడదు అని హెచ్చరిస్తున్నారు. అలా ఏకగ్రీవాలు జరిగిన చోట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లకు, మాజీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఉండవని తేల్చి చెబుతున్నారు. ఇది కచ్చితంగా గొప్ప డేంజర్ గేమ్. పార్టీ క్యాడర్ నిలబడాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. కానీ క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థలు అంటేనే ఒక రకమైన సర్దుబాటు వాతావరణం ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఎంతటి పెద్ద స్థాయి నాయకులు అయినా.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏకగ్రీవాలకు సహకరించాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు జరిగితే టిక్కెట్లు ఇవ్వనని తేల్చి చెబుతున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
* ఖర్చుతో కూడుకున్న పని..
సార్వత్రిక ఎన్నికలు ఒక ఎత్తు, స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎన్నికలు జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రాష్ట్రస్థాయి నాయకులు ఉన్న గ్రామాల్లో సైతం.. ఏకగ్రీవాల సంస్కృతి నడుస్తూ ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతకు స్థానిక సంస్థల పగ్గాలు అందించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 పంచాయితీలు ఇదే మాదిరిగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి ఇది తెలియంది కాదు. అయినా సరే ఆయన ఏకగ్రీవాలకు పట్టుబడుతున్నారు అంటే కచ్చితంగా క్యాడర్ నిలబెట్టేందుకే. అయితే అధికార పార్టీ గా 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకున్నారో తెలియంది కాదు. అది తెలిసి కూడా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తుండడంపై వైసీపీ నేతల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
* ఏ బలం లేని నేతలతో పోటీ..
స్థానిక పరిస్థితులకు కాదని.. బరిలో దిగేందుకు ఏ వైసీపీ చోటా నేత ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి చోట ఎవరినో ఒకరిని పోటీ లో దించాలి అంటే కచ్చితంగా ఆర్థిక భారం నియోజకవర్గ ఇన్చార్జిలపై పడుతుంది. సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లోనే ఎక్కువగా ఖర్చు ఉంటుంది. పైగా కూటమి దూకుడుగా ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో బరిలో దిగాలంటే కచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం ఖాయం. అయితే పార్టీని నిలబెట్టుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ డేంజర్ గేమ్ ఆడుతున్నారు. కచ్చితంగా అధినేత ఆదేశాలతో ఏకగ్రీవాలు జరగకుండా ఎక్కడికక్కడే అభ్యర్థులను నిలబెడతారు. కానీ నామినేషన్ వేశాం అంతే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. దారిన పోయే దానయ్యను తెచ్చి నామినేషన్ వేయిస్తారు. కచ్చితంగా పోటీ చేయిస్తారు. అయితే దానివల్ల ఓటమి అనే అంశం తప్ప మరొక ప్రయోజనం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వేరేలా ఆలోచన చేస్తున్నారు. వైసీపీలో ఏ గుర్తింపు లేని చోటా నేతలు సైతం ఈసారి రంగంలో ఉంటారన్నమాట