Nara Lokesh Convoy: మంత్రి నారా లోకేష్ రాయదుర్గం నియోజకవర్గం లో పర్యటించారు. అక్కడ ఓ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే భారీ కాన్వాయ్ తో వెళ్తున్న ఆయనకు ఓ చిన్నారి నుంచి షాకింగ్ పరిణామం ఎదురయింది. ఒక్కసారిగా కాన్వాయ్ ఆగింది. మంత్రి లోకేష్ రోడ్డుపైకి దిగారు. భద్రతా సిబ్బంది కొద్దిసేపు హైరానా పడ్డారు. అయితే అంతా సవ్యంగా జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గం లో పవన విద్యుత్, సుజ్లాన్ కంపెనీ విస్తరణకు సంబంధించి శంకుస్థాపన చేశారు నారా లోకేష్. అంతకుముందు భారీ రోడ్ షో చేపట్టారు. జోరు వానలో సైతం ఈ రోడ్ షో సాగడం విశేషం. వేలాది మంది టిడిపి శ్రేణులు హాజరయ్యారు.
* పూలదండ వేసేందుకు..
కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి లోకేష్ వెళ్తుండగా భారీ కాన్వాయ్ అనుసరించింది. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఓ చిన్నారి పూలదండతో నిలబడుతూ కాన్వాయ్ వద్దకు సమీపించింది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ చిన్నారితో పాటు కుటుంబ సభ్యులు రహదారిపైకి రాగా వారించే ప్రయత్నం చేశారు. ఇంతలో నారా లోకేష్ ప్రయాణిస్తున్న వాహనం అక్కడ ఆగింది. లోకేష్ బయటకు వచ్చి ఆ చిన్నారితో ముచ్చటించారు. ఆ చిన్నారి చేతుల మీదుగా పూలదండ వేయించుకున్నారు. ఏం చదువుతున్నావని ప్రశ్నించారు. ఆ చిన్నారి తండ్రి లోకేష్ కు పాదాభివందనం చేయడానికి ప్రయత్నిస్తుండగా వద్దని వారించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* ఘన స్వాగతం..
కాగా ఈ పర్యటనలో భాగంగా రాయదుర్గం- బళ్లారి రోడ్డులో మంత్రి నారా లోకేష్ కు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్యాలు, డప్పుల మూతతో సందడి నెలకొంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చారు నాయకులు పార్టీ శ్రేణులు. వర్షం కురుస్తున్నప్పటికీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా పెద్ద సంఖ్యలో రోడ్డు వెంట చేరుకున్నారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు లోకేష్. యువనేత పర్యటన నేపథ్యంలో టిడిపి శ్రేణుల్లో జోష్ నెలకొంది. రాయదుర్గం నియోజకవర్గం లో పరిశ్రమలకు సంబంధించి నిర్మాణానికి శ్రీకారం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేశారు లోకేష్.
View this post on Instagram