Chandrababu Naidu : మూడో తరగతి చదువుతున్న చిన్నారి అలావోకగా ఇంగ్లీష్ ప్రసంగం చేసింది. అలాగని ఆ విద్యార్థిని ఏదో ప్రైవేట్ స్కూల్లో చదవలేదు. ప్రభుత్వ స్కూల్లో చదువుకుంది. కానీ ధారాళంగా మాట్లాడుతూ ఇంగ్లీషులో అరుదైన ప్రసంగం చేసింది. వేలాది మంది జనం, ఆపై వేదికపై హేమా హేమీలైన నాయకుల ముందు అనర్గళంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఆ చిన్నారి ప్రసంగాన్ని వింటూ ఫిదా అయ్యారు. ఆ చిన్నారిని అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రసంగం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
* అనకాపల్లి జిల్లాలో..
అనకాపల్లి జిల్లాలో ఏ కోడూరు లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రసంగించారు. మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రాష్ట్రవ్యాప్తంగా అందుతున్న సంక్షేమ పథకాలు, పాఠశాలల్లో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమం పై మాట్లాడారు. ఏపీ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని.. అది ఆక్టివ్ ప్రోగ్రెస్ అని చెప్పేసరికి సభలో చప్పట్లు మార్మోగాయి. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం మనది అంటూ గర్వంగా చెప్పేసరికి చంద్రబాబు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణం.. విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం అని కొనియాడారు. బాబు కేవలం రాష్ట్రానికి కాకుండా.. దేశానికి ఒక విజనరీ లీడర్ అని చిన్నారులు వ్యాఖ్యానించారు. అయితే ఆ చిన్నారి ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఆ చిన్నారిని అభినందనలతో ముంచెత్తారు సీఎం చంద్రబాబు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* అటు లోకేష్ పర్యటన..
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ ఒకేరోజు పర్యటనలు చేశారు. విశాఖ నగరంలోని చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభోత్సవాలు చేసిన నారా లోకేష్ అక్కడి విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో వేదిక పంచుకొని.. ముఖాముఖి నిర్వహించారు. క్రీడా పోటీల్లో కూడా పాల్గొన్నారు. చంద్రబాబు కే కోటపాడు మండలంలో కే కోడూరులో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఒకేరోజు తండ్రి కొడుకులిద్దరూ విశాఖలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యమిస్తున్న వేళ.. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కీలక ప్రసంగాలు, ప్రభుత్వ తీరును కొనియాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకు కూడా ఆకట్టుకుంటున్నాయి.