Andhra Jyothy RK : గత వారం కొత్త పలుకు సంపాదకీయానికి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ విరామం ఇచ్చారు. ఈ ఆదివారం అందరూ ఊహించినట్టుగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను తనదైన శైలిలో విశ్లేషించారు. ముఖ్యంగా ఈ విశ్లేషణ రేవంత్ రెడ్డి కేంద్రంగా సాగింది.
ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. పరకాల నియోజకవర్గం లో తాను పోటీ చేస్తాను అనుకుంటుంటే.. రేవూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నెత్తికి కళ్ళు ఎక్కాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక మంత్రి కుమార్తె అయి ఉండి అలా మాట్లాడటం ఒకరకంగా రాజకీయాలలో సంచలనంగా మారింది. సురేఖ కుమార్తె మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. సురేఖకు ఏకంగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీస్ కు సురేఖ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దాని వెనుక అదృశ్య శక్తి ఉన్నారని ఆరోపించారు. ఈ పరిణామాలు ఇలా సాగుతుంటే.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం మోకాలు అడ్డింది. దీంతో రేవంత్ రెడ్డి మీద మరింత ఒత్తిడి పెరిగిపోయింది .
ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలను రాధాకృష్ణ చెప్పుకుంటూ పోయారు. రేవంత్ వల్లే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పిన ఆయన.. గులాబీ పార్టీ.. వైసిపి ఏకమై రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నాయని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అంటే రేవంత్ రెడ్డి బలహీనంగా మారిపోవాలి. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి బలహీనంగా మారితేనే కెసిఆర్ అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. అందువల్లే కేసీఆర్.. జగన్ కి సంబంధించిన సొంత మీడియా సంస్థలు రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నయని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.
ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉందని.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఏర్పడాలని.. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకుంటే ఆయనను ఆ స్థానం నుంచి తప్పించి.. కొత్త వాళ్లకు అవకాశం కల్పించాలని.. అప్పటికి కుదరకపోతే రేవంత్ రెడ్డికి తగినంత స్వేచ్ఛ ఇవ్వాలని రాధాకృష్ణ సూచించారు. కానీ ఇలా వేచి చూసే ధోరణి అవలంబిస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని.. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పోరు పెరిగిపోతే.. కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.. .
సీఎంవో లో రేవంత్ సోదరుల జోక్యం ఎక్కువగా ఉందని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇందులో గనుక నిజం ఉండి ఉంటే వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉందని రాధాకృష్ణ హిత బోధ చేశారు. మొత్తానికి ఈ సంపాదకీయంలో రాధాకృష్ణ మొత్తంగా రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. ఇటీవల కాలంలో రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ స్థాయిలో సంపాదకీయం రాలేదు. దీనిని బట్టి ఏదో జరుగుతోంది.. అనే అనుమానం తెలంగాణ ప్రజల్లో మొదలైంది. ఆ అనుమానం విస్తరిస్తే మాత్రం రేవంత్ రెడ్డికి ఇబ్బంది.. కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బంది.