Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త సందడి నెలకొంది. ఈనెల 17 నుంచి పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఈనెల 1న ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. అయితే 17 నుంచి విమాన రాకపోకలు ప్రారంభం అవుతాయని పౌర విమానయాన ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే దానికి కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ప్రైవేటు ఎయిర్లైన్స్ సైతం తమ సర్వీసులను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే తొలి రోజు ఏకంగా 31 సర్వీసులను నడప నుంది ఇండిగో ఎయిర్లైన్స్. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాలకు ఈ విమానాలు నడవనున్నాయి. తన తొలి రోజు సర్వీస్ లను ప్రకటించింది ఇండిగో ఎయిర్లైన్స్.
* 16 అర్ధరాత్రి తో బంద్..
ఈనెల 16 అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు రద్దు అవుతాయి. అక్కడ నుంచి సేవలందించే విమానాలన్నీ భోగాపురం నుంచి మొదలవుతాయి. ఈ క్రమంలో విమాన సర్వీసుల రాకపోకలపై ఎయిర్లైన్స్ సంస్థలు ఒక్కొక్కటి షెడ్యూల్ విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండిగో విమానయాన సంస్థ తొలి రోజు 31 సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. భోగాపురం నుంచి ఆరోజు ఉదయం 8:55, 10:40, మధ్యాహ్నం ఒంటిగంట, సాయంత్రం 4:25, రాత్రి 7:20, 8:40, 9 20 గంటలకు విమానాలు బయలుదేరనున్నాయి. భోగాపురం నుంచి ఢిల్లీకి ఉదయం 8:20, రాత్రి 10:45… బెంగళూరుకు మధ్యాహ్నం 2:55, రాత్రి 9:10, చెన్నైకి మధ్యాహ్నం 12:15, సాయంత్రం 6:35.. కోల్కత్తా కు రాత్రి 7:50, ముంబైకి మధ్యాహ్నం 3:05, తిరుపతికి మధ్యాహ్నం 1:50 గంటలకు విమానాలు అందుబాటులోకి వస్తాయని ఇండిగో తెలిపింది.
* మరోవైపు ఎయిర్ ఇండియా కూడా అక్టోబర్ 24 వరకు భోగాపురం నుంచి నడిచే విమానాల షెడ్యూల్ ను ప్రకటించింది. హైదరాబాదు నుంచి భోగాపురం మధ్య రోజుకు ఐదు సర్వీసులు.. బెంగళూరు నుంచి భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులు నడపనుంది. ఆది, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజులు మరో సర్వీస్ అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి భోగాపురం మధ్య రోజుకు నాలుగు సర్వీసులు నడవనున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కమర్షియల్ సర్వీసులో తొలి విమానం సింగపూర్ కు వెళ్లనుంది. ఆగస్టు 16న రాత్రి 11:05 గంటలకు స్కూట్ ఎయిర్లైన్స్ విమానం భోగాపురం లో ల్యాండ్ అవుతుంది. ఈ విమానం గంట తర్వాత 12:05 గంటలకు సింగపూర్ బయలుదేరుతుంది.