Telangana Secretariat: తెలంగాణ పరిపాలనకు గుండెకాయ లాంటిది సచివాలయం. ఇందులో ఆరవ అంతస్తులో సీఎంఓ.. సిపిఆర్ఓ కార్యాలయాలు ఉంటాయి. ఈ కార్యాలయాలకు నిత్యం చాలామంది వస్తుంటారు. పరిపాలనకు సంబంధించి.. అభివృద్ధికి సంబంధించి.. పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ చర్చలు జరుగుతూ ఉంటాయి.
ముఖ్య అధికారులను కలవడానికి వచ్చిన వారికి టీ లేదా స్నాక్స్ లేదా టిఫిన్ లేదా భోజనం పెట్టడం అలవాటు. ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఇటువంటి అతిధి మర్యాద ఉంటుంది. కాకపోతే 2023 నుంచి ఇప్పటివరకు ఈ కార్యాలయాలలో ఊహించిన దానికంటే భోజనాల ఖర్చు..టీ.. స్నాక్స్ ఖర్చు పెరిగిపోతుంది. బిల్లులు అంచనాలకు మించి పెరిగిపోవడంతో ఇటీవల కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం నిలిపివేశారు. దీంతో కాంట్రాక్టర్లు ఆ కార్యాలయాలకు టీలు.. టిఫిన్లు.. భోజనాలు పంపించడం ఆపేశారు.
ఈ వ్యవహారం మీడియాలో రావడంతో రచ్చ రచ్చ అయింది. నమస్తే తెలంగాణ.. ఇంకా గులాబీ పార్టీ అనుకూల మీడియా సంస్థలు నెగిటివ్ ప్రాప గండా మొదలుపెట్టాయి. చూశారా మా కెసిఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా ఉండేదో.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో.. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనే రేంజ్ లో వార్తలను వడ్డించడం మొదలుపెట్టాయి. వాస్తవానికి ఈ అంతస్తులో భారీగా భోజనాల ఖర్చు.. టిఫిన్, టీ ల ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు వాటిని తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా సరే దుబారా ఖర్చును సహించదు. ఎందుకంటే ఆడిట్ లో ఇది గనక బయటపడితే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అది కాస్త ప్రభుత్వ పతనానికి దారితీస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంఓ.. సిపిఆర్ఓ కార్యాలయాలకు పనిమీద వచ్చేవారికి ఒక కప్పు చాయ్ ఇవ్వడానికి ఇండెంట్ పెట్టాలని నిర్ణయించింది. సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇకపై అధికారులు సంతకాలు పెడితేనే టీ ఇస్తారు. భోజనాలు సరఫరా చేస్తారు. తద్వారా వృధా ఖర్చుకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు.. దీనివల్ల అవసరం ఉంటేనే భోజనాలు.. ఇతర పదార్థాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లు తగ్గుతుంది. అప్పుడు ఆర్థిక శాఖ మీద భారం తగ్గుతుంది. కాకపోతే ఈ వ్యవహారాన్ని గులాబీ పార్టీ అనుకూల మీడియా సంస్థలు వేరే విధంగా రాయడం మొదలు పెట్టాయి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిందని శోకాలు ప్రారంభించాయి.