Srikakulam Child Missing: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. నెలల తరబడి వందలాది మంది పోలీసులు, చివరకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినా ఆచూకీ కాన రాలేదు. దీంతో ఎక్కడ చిన్నారులు అదృశ్యం అవుతున్నా పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతున్నారు. మొన్నటికి మొన్న ఓ జిల్లాలో ఓ చిన్నారి అదృశ్యం కాగా రంగంలోకి దిగిన పోలీసులు జల్లెడ పట్టి పట్టుకున్నారు. అటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లాలో కూడా జరిగింది తాజాగా. ఇంటి నుంచి ఆడుకునేందుకు బయటకు వెళ్ళిన ఓ చిన్నారి నిద్రమత్తులోకి జారిపోయింది. ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాత్రంతా జల్లెడ పట్టారు. ఓ చోట చిన్నారి పడుకొని కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
* శ్రీకాకుళం జిల్లాలో ఘటన..
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గుండుపేటకు చెందిన మోహిత్ అనే రెండేళ్ల బాలుడు గురువారం సాయంత్రం వీధిలో ఆడుకునేందుకు బయటకు వెళ్ళాడు.. అలా సమీప తోటల్లో తుప్పల్లో నిద్రమత్తుకు జారుకున్నాడు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన మోహిత్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. ఆచూకీ కోసం వెతికారు. దొరకకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఊరంతా జల్లెడ పట్టారు. కానీ ఆచూకీ దొరకకపోవడంతో.. ఈ ఘటన మిస్టరీగా మారిపోతుందని తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
* చివరికి పాదముద్రికల సహకారంతో..
పోలీసుల దర్యాప్తునకు వర్షం ఎంతగానో సహకరించింది. ఇంటి ప్రాంగణం తో పాటు సమీప తోటల్లో వర్షం పడడం అంతా బురద మయంగా మారింది. అప్పుడే పోలీసులకు ఒక ఆలోచన వచ్చింది. టార్చ్ లైట్ వెలుగుల్లో చిన్నారి పాదముద్రికలు పడి ఉంటాయని భావించి వెతకడం ప్రారంభించారు. అలా పాదముద్రికలు దొరకడంతో వాటిని అనుసరిస్తూ ముందుకు సాగారు. సమీప తోటల్లో తుప్పల మధ్య ఆ రెండేళ్ల చిన్నారి మోహిత్ నిద్రిస్తూ కనిపించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏ అటవీ జంతువుకు కానీ.. విషపూరిత కీటకాలకు కానీ దొరికి ఉంటే మాత్రం ఆ చిన్నారి ప్రాణాలతో బతికి బట్ట కట్టడం జరిగే పని కాదు. మరోవైపు సమీపంలోనే నేల బావులు ఉన్నాయి. నిద్రమత్తులో ముందుకు సాగి ఉంటే అపాయం తప్పేది కాదు. కానీ ఆ చిన్నారి క్షేమంగా దొరకడంతో.. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సైతం హమ్మయ్య అంటూ ఉపశమనం పొందారు.