Kohinoor Kharbuja : పసుపచ్చ రంగులో ఉంటుంది. విదేశాల వాళ్ళు దీనిని కళ్ళకు అద్దుకుంటారు.. ఎంత అడిగినా సరే ఇచ్చేస్తూ ఉంటారు.. అవసరమైతే ముందస్తుగా అడ్వాన్సులు కూడా ఇస్తుంటారు. కొన్ని సందర్భాలలో లక్షలు కూడా దాటుతుంది. ఆ స్థాయిలో ఉంటుంది మరి దీని విలువ.. ఇంతకీ ఇదేంటి.. దీని కథ ఏంటి.. ఈ కథనంలో తెలుసుకుందాం..
ఏపీ రాష్ట్రంలో భిన్నమైన పంటలు పండుతాయి. ముఖ్యంగా రతనాలకు నెలవు లాంటి రాయలసీమలో ఎక్కువగా ఉద్యాన పంటలు పండుతాయి. సినిమాలలో రాయలసీమను కరువుకు కేరాఫ్ అడ్రస్ గా చూపిస్తుంటారు. కానీ రాయలసీమ అలాంటి దుర్భిక్షమైన ప్రాంతం కాదు. ఇక్కడ కూడా మెండుగా నీటి వనరులు ఉన్నాయి. కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. భూమిలో బంగారం పండించే సత్తా వారి దగ్గర ఉంది. అలాంటి రైతులే ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో బంగారం కాదు వజ్రాలకు మించిన స్థాయిలో పంటలు పండిస్తున్నారు. విదేశీయులను ఆకట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో రైతులు కోహినూరు రకానికి చెందిన కర్భుజా పంటను సాగు చేస్తున్నారు.. ఈ పంటను వేసవికాలంలో సాగు చేస్తూ ఉంటారు. నాటిన రెండు నెలలకు కాపుకు వస్తుంది. ఈ కర్బుజా మొత్తం పసుపు రంగులో ఉంటుంది. మిగతా కర్బూజతో పోల్చితే.. ఇందులో తీయదనం అధికంగా ఉంటుంది. పైగా ఈ కాయలు దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటాయి. సగటున ఎకరానికి 20 నుంచి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ధర బాగుంటే ఎకరానికి 10 లక్షల వరకు లభిస్తుంది. ఐదు ఎకరాలు వేసుకుంటే 50 లక్షలు జేబులో ఉన్నట్టే. సకటున ఒక్కో పండు రెండు కిలోల వరకు ఉంటుంది. పండు పండిన తర్వాత తొక్క బంగారు పసుపు రంగులోకి మారుతుంది. కొన్ని పండ్ల మీద స్వల్పంగా గీతాలు ఉంటాయి. ఈ పండులో లోపలి భాగం లేత రంగులో ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే మృదువుగా ఉంటుంది. సాధారణ రకాలతో పోల్చి చూస్తే ఇందులో తీపి అధికంగా ఉంటుంది. ఇందులో షుగర్ కంటెంట్ 14 నుంచి 17 శాతం వరకు ఉంటుంది.
అనంతపురంలో పడిన ఈ పంటను రైతులు స్థానికంగా విక్రయిస్తుంటారు. ఢిల్లీకి చెందిన వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి పంటను కొనుగోలు చేసి వెళ్తుంటారు. ఇంగ్లాండ్.. అమెరికా.. యూరప్ దేశాల చెందిన వారు కూడా ఈ పండ్లను ఎక్కువగా తినడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. అందువల్లే ఈ పండ్లకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంటుంది. విదేశాలకు పండ్లను ఎగుమతి చేసినప్పుడు రైతులకు గిట్టుబాటు భారీగానే అవుతుంది.