Sajjala Ramakrishna Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై పరువు నష్టం దావా దాఖలయింది. ఆయనతోపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు తో సహా సోషల్ మీడియా చానల్ నిర్వహిస్తున్న వారిపై కూడా పరువు నష్టం దావా వేశారు సంగం డైరీ ఎండి గోపాలకృష్ణన్. గుంటూరు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఆవు నెయ్యి సరఫరా టెండర్ విషయంలో తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారని సజ్జలతో పాటు తూమాటిపై న్యాయ పోరాటానికి దిగింది సంగం డెయిరీ. సజ్జల రామకృష్ణారెడ్డి, తూమాటి మాధవరావు, సోషల్ మీడియా ఛానల్ తో పాటుగా వీరి వ్యాఖ్యలను ప్రసారం చేసిన గూగుల్ ఎల్.ఎల్.సి, మెటా ప్లాట్ఫారం లను కూడా సంగం డైరీ దావాలో ప్రతివాదులుగా చేర్చింది.
* అక్రమార్గంలో ఆవు నెయ్యి సరఫరా..
సజ్జల రామకృష్ణారెడ్డి సంఘం డైరీ నెయ్యి సరఫరా విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీకి సంగం డైరీ నుంచి నెయ్యి సరఫరా జరుగుతూ వస్తోంది. అయితే ఆవు పాలతో తయారు చేయాల్సిన నెయ్యి బదులు.. గేదె పాలతో తయారుచేసిన నెయ్యిని సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఇదే వ్యాఖ్యలను ప్రస్తుత మండలి డిప్యూటీ చైర్మన్ మాధవరావు సైతం చేశారని.. వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ప్రసారం చేసిందని.. ఇది రైతుల మనోభావాలను దెబ్బతీయటమేనని.. సంస్థ ప్రయోజనాలకు హాని కలిగించటమేనని.. దీనిపై 10 కోట్ల రూపాయల పరువు నష్టం వేస్తూ సంగం డైరీ కోర్టును ఆశ్రయించింది. ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది.
* పాల సేకరణ లేకుండా..
సంగం డైరీ అసలు పాల సేకరణ చేయడం లేదా అనేది సజ్జల ఆరోపణ. పాల సేకరణ జరపకుండా టీటీడీకి అక్రమ మార్గాల్లో నెయ్యి సరఫరా చేస్తున్నారు అంటూ మొన్న ఆ మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సంగం డైరీ యాజమాన్యం అభ్యంతరాలు తెలిపింది. వాస్తవాలను పూర్తిగా కప్పిపుచ్చి.. డైరీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా.. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సజ్జల మాట్లాడారని ఎండి గోపాలకృష్ణన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. కట్టు కథలతో సమస్త పై బురద జల్లడమే లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్న తూమాటి మాధవరావు సైతం ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను 10 కోట్ల రూపాయల పరువు నష్టం చెల్లించాలంటూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.