Homeఆంధ్రప్రదేశ్‌ABN RK : వైయస్ షర్మిల తరఫున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వకల్తా: ఆస్తులు ఇవ్వాలని జగన్...

ABN RK : వైయస్ షర్మిల తరఫున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వకల్తా: ఆస్తులు ఇవ్వాలని జగన్ కు అల్టిమేటం

ABN RK : ఏ ముహూర్తాన జగన్, వైయస్ షర్మిల మధ్య విభేదాలు ఏర్పడ్డాయో.. ఆనాటి నుంచి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ షర్మిలకు దేవుడు ఇచ్చిన అన్న అయి పోయాడు.. అంతేకాదు షర్మిల వార్త అంటేనే సెంటీమీటర్ స్పేస్ కూడా ఇవ్వని తన పేపర్లో పేజీలకు పేజీలు వార్తలు కుమ్మరిస్తున్నాడు. ఒక్క బైట్  కూడా ప్రసారం చేయని తన చానల్లో ఏకంగా గంటలకొద్ది ప్రైమ్ టైం బులిటెన్లు ప్రసారం చేస్తున్నాడు. అంతేకాదు తన కొత్త పలుకులోనూ షర్మిలకు అమితమైన ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే దేవుడు ఇచ్చిన అన్న చేస్తున్న సహాయానికి షర్మిల కూడా “జాకెట్” రూపంలో భారీగానే సమర్పించుకుంటున్నది. అయితే ఈ బంధం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే చాలా చిక్కగా ఉంది.
ఆస్తులు ఇవ్వాల్సిందే
వాస్తవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రధాన కారణాల్లో షర్మిల కూడా ఒకరు. అక్రమాస్తుల కేసులో చర్లపల్లి జైల్లో జగన్ ఉన్నప్పుడు.. షర్మిల అతడికి సంఘీభావంగా రాష్ట్రం మొత్తం పాదయాత్ర నిర్వహించారు. నాడు వైయస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారికి ఓదార్పు పేరుతో నగదు సహాయం కూడా చేశారు. కుటుంబాలను పరామర్శించారు. నాడు షర్మిల పాదయాత్ర చేయడం ద్వారా జగన్ జైల్లో ఉన్నప్పటికీ ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కాదు రాజకీయాల్లో ఆయన సుస్థిరతను కాపాడింది. తర్వాత జగన్ విడుదల కావడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలకు అమితమైన ప్రాధాన్యం ఇస్తారని ప్రచారం జరిగింది. ఇక్కడే సీన్ రివర్స్ అయింది.
ఆస్తులు ఇవ్వాల్సిందే
అయితే జగన్, షర్మిల మధ్య ఆస్తులకు సంబంధించే విభేదాలు ఏర్పడ్డాయని ఆ కుటుంబాలకు అత్యంత సన్నిహితులు అంటూ ఉంటారు. అయితే అధికారంలోకి రాగానే షర్మిల మరో పవర్ హౌస్ కాకుండా జగన్ నిరోధించాడని చెబుతుంటారు. అధికారం ఎలాగూ ఇవ్వలేకపోయినా తనకు కనీసం ఆస్తులైనా ఇవ్వాలని జగన్ ను షర్మిల కోరారని, కానీ దానికి ఆయన ఒప్పుకోలేదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నాడు. అంతేకాదు షర్మిలను తాడేపల్లి ప్యాలస్ లోకి రానీయకుండా అల్టిమేటం విధించాడని రాస్తూ ఉంటాడు.. అందులో బాగానే ఆమె దూరంగా ఉంటున్నదని, పార్టీ కూడా ఏర్పాటు చేసిందని రాధాకృష్ణ చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల అవసరం జగన్ కు పడింది కాబట్టి, ఆస్తులు పంచిస్తానని రాయబారం పంపుతున్నట్టు ఆర్కే తన కొత్త పలుకులో రాసుకొచ్చాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయిన తర్వాతే..
అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేస్తానని జగన్ మాటిస్తే, దానికి షర్మిల, విజయమ్మ ఒప్పుకోలేదని రాధాకృష్ణ చెబుతున్నాడు. ముందుగా ఆస్తులు విభజన పూర్తి అయిన తర్వాతే మిగతా కార్యక్రమాలు చూద్దామని షర్మిల తిరుగు సమాధానం ఇచ్చినట్టు రాధాకృష్ణ అంటున్నాడు. ఆ ఇద్దరు అన్నా చెళ్ళెల్ల మధ్య ఏం జరుగుతుందో తెలియదు గాని.. రాధాకృష్ణ చెప్తుంది మాత్రం నిజం అనిపిస్తోంది. అయితే ఇందులో కొంత అతిశయోక్తి ఉండొచ్చు గాని.. ప్రతిపక్ష పార్టీల్లో ఏ కొంత వ్యతిరేకత కనిపించినా దానిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చడంలో రాధాకృష్ణ సిద్ధహస్తుడు. ఈ వారం కొత్త పలుకు వ్యాసం కూడా అలానే రాసుకుంటూ పోయాడు. యధావిధిగా జగన్ మీద విషం కక్కాడు. చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పాడు.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular