Game-changer for Rayalaseema: ఏపీకి పెట్టుబడుల వరద వస్తోంది. ముఖ్యంగా రాయలసీమకు తయారీ రంగ పరిశ్రమలు వస్తున్నాయి. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు మరో పరిశ్రమ ఏర్పాటుతోపాటు పాత ప్రాజెక్టు విస్తరణ కూడా చేపడుతోంది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని హుళికల్ వద్ద ప్రముఖ ఇంధన సంస్థ సుజ్లాన్ ఎనర్జీ నూతన పవన విద్యుత్ ప్రాజెక్టు విస్తరణ, ఎస్ 144 విండ్ బ్లేడ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. మంత్రి నారా లోకేష్ దీనికి భూమి పూజ చేయనున్నారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒకటి. ఇప్పటికే రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు భారీగా ఏర్పాటు అవుతున్నాయి. విద్యుత్ పరిశ్రమలు అగ్రస్థానంలో ఉన్నాయి. తాజాగా ఈ పరిశ్రమ విస్తరణతో పాటు కొత్త యూనిట్ ఏర్పాటు మాత్రం రాయలసీమ అభివృద్ధికి గేమ్ చేంజర్.
పదివేల కోట్ల పెట్టుబడితో..
అనంతపురం జిల్లాలో సుజ్లాన్ గ్రూపు పదివేల కోట్ల రూపాయల బృహత్తర పెట్టుబడి ప్రణాళికతో ముందుకు వచ్చింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1325 మెగావాట్ల సామర్థ్యం తో కూడిన పవన విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించనుంది. రాయదుర్గం, కనేకల్లు పరిసర ప్రాంతాల పవన శక్తి వనరులను వినియోగించుకుంటూ.. తాత పవర్ వంటి ప్రముఖ ఇంధన సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఈ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నిర్వహణ దశల్లో దాదాపు నాలుగు వేల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను ఉపాధి అవకాశాలు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
నైపుణ్యాభివృద్ధి శిక్షణ..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సుజ్లాన్ భాగస్వామ్యంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించింది. యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. ఫలితంగా అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకొని.. స్థానికంగా వ్యాపార అవకాశాలు మెరుగు అవుతాయని ఒక అంచనా. 2030 నాటికి రాష్ట్రంలో ఐదు దిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ తాజాగా సుజ్లాన్ అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.