Shehbaz Sharif: మన దాయాది దేశం పాకిస్తాన్. అంతర్గత సమస్యలతో సతమలమవుతోంది. దీంతో దాని నుంచి బయటపడేందుకు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేయడం అదేశ నేతలకు, సైనికాధికారులకు అలవాటే. ఇటీవలే పాకిస్తాన్‌లోని అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్ స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఆగస్టు 11న వేడుకలు జరుపుకుంది. ఖైబర్‌ఫఖ్తూన్వా, సిందూ, పీవోకేలోనూ ఉద్యమాలు జరుగుతున్నాయి. మరోవైపు ఆఫ్గానిస్తాన్ అదనుచూసి ఫాకిస్తాన్‌పై దాడులు చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా పాకిస్తాన్ 80వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంది. ఇందులో ఆదేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందం విషయంలో తమ హక్కులను ఎర్రగీతగా పరిగణిస్తామని, ఏ చిన్న మార్పు జరిగినా గట్టి ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించారు. ఇది అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంగా అనిపిస్తోంది.
శాంతి కోరుతూ బెదిరింపులు
ఇస్లామాబాద్‌లోని కార్యక్రమంలో ఆయన పాకిస్తాన్ శాంతిని కోరుకుంటున్నప్పటికీ, దాన్ని బలహీనతగా భావించవద్దని చెప్పారు. సార్వభౌమత్వం లేదా రక్షణ ప్రయోజనాలకు ముప్పు ఏర్పడితే 2025 మే నాటి కంటే బలంగా స్పందిస్తామని ప్రకటించారు. అయితే గతేడాది జరిగిన ఘర్షణల్లో తామే విజయం సాధించామని మరోసారి దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇటువంటి అసత్య ప్రచారం దేశీయ రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగపడుతోంది. పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఇటువంటి ఉగ్రవాద సంబంధిత విషయాలను ముందుకు తీసుకురావడం అంతర్గత విమర్శలను తగ్గించే వ్యూహంగా కనిపిస్తోంది.
సిందూ ఒప్పందం నిలిపివేత..
2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. తూర్పు నదులు (రవి, బియాస్, సట్లజ్) భారత్‌కు, పశ్చిమ నదులు (సింధు, ఝేలం, చీనాబ్) పాకిస్తాన్‌కు కేటాయించారు. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్‌లో వ్యవసాయం, తాగునీటి సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో నీటి కొరత పెరిగింది. అక్కడి ప్రభుత్వం పదేపదే నీటి విడుదలకు డిమాండ్ చేస్తోంది. కానీ భారత్ స్పష్టంగా చెప్పింది. నీరు, రక్తం కలిసి ప్రవహించవు. సరిహద్దు దాడులు ఆగితేనే ఈ అంశంపై చర్చలకు అవకాశం ఉంటుంది. ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైతే దాన్ని రద్దు చేసే అధికారం సార్వభౌమ దేశానికి ఉందని నొక్కిచెప్పింది.
రాజకీయ లబ్ధి కోసమే..
షెహబాజ్ షరీఫ్ ప్రకటనలు పాకిస్తాన్ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. నీటి హక్కులను రక్షించుకుంటామని చెప్పడం సహజమే అయినా, ఉగ్రవాదాన్ని ఆపకుండా కేవలం బెదిరింపులతో సమస్య పరిష్కారం కాదు. పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్టమైన సందేశం. పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దు దాడులు కొనసాగుతున్నంత కాలం జలాల అంశంపై ఎలాంటి సానుకూల పరిణామం ఆశించచడం అత్యాశే.
భారత్ వైఖరి స్థిరంగా ఉంది. ఉగ్రవాదానికి ముగింపు పలికితేనే జలాల అంశంపై సానుకూల చర్చలు సాధ్యమవుతాయి. లేకపోతే ఈ వివాదం మరింత తీవ్రమవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత్ తన సార్వభౌమ హక్కులను సమర్థించుకోవడం సహజం. పాకిస్తాన్ ఈ విషయంలో రాజకీయ లాభం కోసం మాత్రమే ఉద్రిక్తతను పెంచుతోంది.