Pakistan Prime Minister: విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీలు ఆ దేశ పరువును అక్కడ కూడా మంట కలుపుతున్నారు. సొంత దేశంలో బతుకుదెరువ లేక గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అయితే వీరుడు నైపుణ్యం లేక అక్కడ కూడా పని దొరకడం లేదు. దీంతో విధి లేని పరిస్థితులు బిచ్చమెత్తుకుంటున్నారు. కొందరు అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. దీంతో అక్కడి ప్రజలు పాకిస్థానీయులను బిచ్చగాళ్లు అనుకుంటున్నారు. ఈ పరిస్థితి మన దాయాది దేశానికి సవాల్ గా మారింది . గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సౌదీ అరేబియాలో వీసా నిబంధనల ఉల్లంఘన, అనధికారిక డబ్బు సేకరణ వంటి సమస్యలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఎంబసీ హెచ్చరిక..
తీర్థయాత్రల పేరిట సౌదీ అరేబియా కు వెళ్తున్నవారు అక్కడే స్థిరపడుతున్నారు. బిచ్చగాళ్ళుగా అవుతారమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీలోని ఎంబసీ అలర్ట్ అయింది. పౌరులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. స్థానిక చట్టాలు, వీసా నియమాలను కచ్చితంగా పాటించాలని కోరింది. మక్కా, మదీనా పరిసరాల్లో భిక్షాటన లేదా అనధికారిక విరాళాల సేకరణపై సౌదీ అధికారులు జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నారని గుర్తు చేసింది. ఉల్లంఘన జరిగితే అరెస్టు, నిర్బంధం, డిపోర్టేషన్ వంటి చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఏఐ వీడియో వైరల్..
ఈ సందేశాన్ని మరింత బలపరిచేందుకు సోషల్ మీడియాలో ఏఐ సాయంతో తయారైన వీడియోను విడుదల చేసింది. అందులో ఒక వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించిన దృశ్యాలు చూపించారు. అనుమతి లేని సేవలు వాడకూడదని, చట్టబద్ధ మార్గాల్లోనే సహాయం అందుకోవాలని సూచించారు. దేశ గౌరవం దెబ్బతినకుండా ఉండాలని పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చింది.
గణాంకాలు ఇలా..
2025లో సౌదీ నుంచి సుమారు 24 వేల మంది పాక్ పౌరులను భిక్షాటన సంబంధిత ఆరోపణలపై తిరిగి పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. యూఏఈ నుంచి దాదాపు ఆరు వేల మంది, అజర్ బైజాన్ నుంచి 2,500 మంది కూడా వెనక్కి వచ్చారు. గల్ఫ్ సహకార మండలి దేశాల నుంచి మొత్తం 38,616 మందిని వివిధ కారణాలతో డిపోర్ట్ చేశారు. వీరిలో సౌదీ వాటా 27,692, యూఏఈ 6,794, ఒమన్ 2,537. ఇందులో కేవలం భిక్షాటన కేసులే కాదు. వీసా ఉల్లంఘన, అక్రమ నివాసం, ఇతర ఇమ్మిగ్రేషన్ సమస్యలు కూడా ఉన్నాయి.
కట్టడికి పాక్ చర్యలు..
దేశంలోనే నియంత్రణ చర్యలు కూడా ముమ్మరం. 2025లో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 66,154 మందిని విమానాశ్రయాల్లోనే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆపింది. సరైన పత్రాలు లేకపోవడం, ప్రయాణ ఉద్దేశంపై అనుమానాలు వంటి కారణాలతో నిలిపివేశారు. ఉమ్రా వీసాలను దుర్వినియోగం చేసి భిక్షాటన చేస్తున్న నెట్‌వర్క్‌లు, అక్రమ వలసలకు సహకరించే ఏజెంట్లపై కూడా దృష్టి సారించారు.
గతంలోనే వార్నింగ్..
2024లోనే సౌదీ అరేబియా పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం వాడకూడదని స్పష్టం చేసింది. మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రాంతాల్లో కఠిన వైఖరి కొనసాగుతోంది. అయినా సమస్య తగ్గకపోవడంతో తాజాగా మరోసారి అప్రమత్తం చేస్తున్నారు. 2019 నుంచి 2025 మధ్య వివిధ దేశాల నుంచి 7,873 మంది డిపోర్ట్ కాగా, వారిలో 1,064 మంది భిక్షాటన కారణంగా తిరిగి వచ్చారు. ఈ పరిస్థితి దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హజ్-ఉమ్రా సమయంలో జరిగే ప్రతి సంఘటన మొత్తం పాక్ పౌరులపై ప్రతికూల ప్రభావం చూపకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
విదేశాల్లో చట్టాలు పాటించకపోతే వ్యక్తిగత నష్టంతోపాటు జాతీయ గౌరవం కూడా దెబ్బతింటుంది. ఇస్లామాబాద్ ఇప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తించి, యాత్రికులను కఠినంగా హెచ్చరిస్తోంది.