Pakistan Politics: పాకిస్తాన్‌లో ఎన్నికైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ సైనిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండటం చాలా దశాబ్దాల నుంచి కనిపిస్తోంది. ఈ వాస్తవం ఇటీవల రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జాతీయ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో మరింత స్పష్టంగా బయటపడింది. ఆయన మాట్లాడుతూ, గతంలో జరిగిన కొన్ని పరిణామాలు ఈ అసమానతను మరలా నిరూపించాయని తెలిపారు.
జాతీయ అసెంబ్లీలో వ్యాఖ్యలు..
ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వ కాలంలో గూఢచార విభాగం ఐఎస్‌ఐకి విపరీతమైన స్వేచ్ఛ లభించిందని చెప్పారు. ఆ సమయంలో ఆ సంస్థ అధినేత లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్ పంపిన అధికారులు చట్టసభ సంబంధిత చర్చల్లో నేరుగా పాల్గొని, నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చేవారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన రాజకీయ కార్యకర్త ఒప్పుకోలుగా వర్ణించారు.
అసద్ ఖైసర్ నివాసంలో చర్చలు..
మాజీ స్పీకర్ అసద్ ఖైసర్ నివాసంలో జరిగిన ముఖ్యమైన సమావేశాల్లో ఐఎస్‌ఐ ప్రతినిధులు హాజరయ్యేవారని, వారు చర్చలను పర్యవేక్షించి, కావాల్సిన దిశలో నడిపించేవారని ఖవాజా ఆసిఫ్ వివరించారు. ఈ సమావేశాల్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సభ్యులు కూడా పాల్గొనేవారని, అక్కడ నిఘా సంస్థ అధికారులు రాజకీయ నాయకుల చర్చలను నిశితంగా గమనించి, అవసరమైన మార్పులు చేసేవారని ఆయన తెలిపారు.
చట్టాలపై నిఘా సంస్థ ఒత్తిడి..
అప్పట్లో మనీలాండరింగ్ వ్యతిరేక చట్టంలో సవరణలు, ఇతర కీలక చట్టాలు ఈ ఒత్తిడి వల్లే అమల్లోకి వచ్చాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. రాజకీయ కార్యకర్తలు, శాసనసభ్యులు ఎలా ముందుకు సాగాలో నిర్దేశించబడేవారని, చట్టసభ కార్యకలాపాలు పూర్తిగా ఆ సంస్థ నియంత్రణలో ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత హైబ్రిడ్ పాలనా విధానం
అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సైన్యంతో సమన్వయంగా పనిచేస్తోందని, పౌరులు–సైనికుల మధ్య సంయుక్త హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఖవాజా ఆసిఫ్ చెప్పారు. ఈ విధానం ఆర్థిక, పరిపాలనా సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతోందని, ప్రత్యేక పెట్టుబడి సౌకర్య కౌన్సిల్ వంటి వేదికల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆదర్శ ప్రజాస్వామ్యం కాదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణాత్మకమైన విధానమని ఆయన వివరించారు.
ఖవాజా వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో సైనిక ప్రభావం ఎంత లోతుగా ఉందో మరలా చర్చకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే పాక్ నేతలకు తాజాగా మంత్రి వ్యాఖ్యలు అవన్నీ పైకి చెప్పడానికే అన్నది అర్థమవుతుంది.
