Islamic NATO: నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రపంచంలో అత్యంత బలమైన కూటమి. ఈ కూటమిలో ఏ దేశంపై దాడి జరిగినా మిగతా దేశాలు దాడిచేసిన దేశాన్ని టార్గెట్ చేస్తాయి. ఇక తర్వాత యూరోపియన్ యూనియన్.. ఇందులో కూడా ఏ దేశంపై దాడి జరిగినా మిగతా దేశాలు ప్రతిఘటిస్తాయి. సమష్టి రక్షణ అందిస్తాయి. ఈమేరకు స్పష్టమైన ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఈ తరహాలోనే ఇటీవల పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే మధ్య ఏర్పడిన కూటమిని కొందరు ఇస్లామిక్ నాటోగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ కూటమి ఆచరణలో పెద్దగా ప్రభావం చూపడం లేదు. కానీ కూటమి అండగా ఉంటుందని టర్కీ ప్రధాని ఎగిరెగిరి పడుతున్నాడు.
కాగితాల్లోనే ఇస్లామిక్ నాటో..
నాటోలో ఒక సభ్య దేశంపై దాడి జరిగితే మిగతా సభ్యులు కలిసి ప్రతిఘటిస్తారు. యూరోపియన్ యూనియన్‌లోనూ ఇలాంటి భావన ఉంది. కానీ పాకిస్తాన్–సౌదీ–టర్కీ కూటమి విషయంలో ఇప్పటివరకు అలాంటి ఆచరణ కనిపించడం లేదు. ఒప్పందం తర్వాత హౌతీలు సౌదీ అరేబియాపై దాడి చేసినప్పుడు పాకిస్తాన్ లేదా టర్కీ నుంచి స్పష్టమైన సైనిక స్పందన రాలేదు. సౌదీ అరేబియా యెమెన్‌పై చర్యలు తీసుకున్నప్పుడు కూడా మిగతా రెండు దేశాలు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చినట్లు కనిపించలేదు. టర్కీపై జరుగుతున్న దాడులు లేదా ముప్పుల విషయంలోనూ పాకిస్తాన్, సౌదీల నుంచి గణనీయమైన స్పందన లేదు. ఇది ఈ కూటమి ఎంతవరకు నిజమైన సమష్టి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుందో సందేహాలు రేకెత్తిస్తోంది.
ఎర్డోగన్ హెచ్చరికలు..
ఇదిలా ఉంటే ఇస్లామిక్ కూటమి ఏర్పడుతోందని, టర్కీ ప్రధాని రేసెప్ తయ్యిప్ ఎర్డోగన్ భారత్‌పై పదే పదే హెచ్చరికలు ఇస్తూ పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ వైఖరి ప్రాంతీయ భద్రతా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. అయితే ఒక దేశం మరో దేశంపై దాడి చేయాలంటే కేవలం రాజకీయ ప్రకటనలు సరిపోవు. సైనిక సామర్థ్యం, లాజిస్టిక్స్, ఆర్థిక బలం, భౌగోళిక దూరం వంటి అంశాలు కీలకం.
మాజీ మేజర్ జనరల్ కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ మాజీ మేజర్ జనరల్ జీడీ భక్షి కీలక వ్యాఖ్యలు చేశారు. టర్కీకి భారత్‌పై దాడి చేసే సామర్థ్యం లేదని, ఒకవేళ అలాంటి ప్రయత్నం జరిగినా రెండు రోజుల్లోపు టర్కీని ధ్వంసం చేసే స్థాయిలో భారత్ సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఒట్టోమన్ సామ్రాజ్య కాలంలో టర్కీ బలంగా ఉండవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సీన్ లేదని, భారత్‌కు టర్కీని నరకం చూపించే శక్తి ఉందని ఆయన స్పష్టం చేశారు.
భారత శక్తికి నిదర్శనం..
ఈ వ్యాఖ్యలు కేవలం ఉద్వేగపూరితమైనవి కావు. భారత్ సైనిక ఆధునికీకరణ, క్షిపణి సామర్థ్యం, వైమానిక శక్తి, నౌకాదళ బలం, అలాగే ఆర్థిక వ్యవస్థ పరిమాణం వంటి అంశాలు ఈ అంచనాకు ఆధారం. టర్కీ బలమైన సైన్యం కలిగిన దేశమే అయినా, భారత్‌తో ప్రత్యక్ష సైనిక ఘర్షణలో దూరం, సరఫరా మార్గాలు, బహుళ ముఖాల నుంచి ప్రతిఘటన వంటి సవాళ్లు ఎదురవుతాయి.
ఇస్లామిక్ నాటోగా ప్రచారం చేస్తున్న కూటమి ఇప్పటివరకు సమిష్టి రక్షణలో విఫలమైనట్లు కనిపిస్తోంది. రాజకీయ ప్రకటనలు, దౌత్యపరమైన సాన్నిహిత్యం ఒకటి. నిజమైన సైనిక మద్దతు మరొకటి. భారత్ విషయంలో ఎర్డోగన్ వంటి నాయకుల హెచ్చరికలు ఉన్నా, సైనిక వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. భారత్ తన సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటూనే ఉంది.