
10th Hindi Question Paper Leak: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీ తో తలపోటు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉండటంతో మరింత ఇబ్బంది.. దీనికి టెన్త్ తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ తోడైంది.. ఫలితంగా భారత రాష్ట్ర సమితిలో ఒత్తిడి మొదలైంది. ప్రభుత్వపరంగా కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ప్రతిపక్షాలు మూకుమ్మడి స్వరాన్ని పెంచాయి. ఆందోళనలను తీవ్రతరం చేశాయి. సరిగ్గా ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితికి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం ఆయాచిత వరంగా మారింది.
టెన్త్ తెలుగు ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం వికారాబాద్ జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.మరుసటి రోజు వరంగల్ జిల్లా కమలాపూర్ లో హిందీ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి కొత్త తలకాయ నొప్పులు తీసుకొచ్చింది. అయితే ఈ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మొదట ప్రభుత్వానికి కూడా తెలియదు ఇది బండి సంజయ్ కి చేరిందని. అయితే మొదట ప్రశ్నపత్రాన్ని ఫార్వర్డ్ చేసింది హెచ్ఎంటీవీ వరంగల్ జిల్లా మాజీ బ్యూరో చీఫ్ ప్రశాంత్. అయితే అతడి ఫోన్ ను పోలీసులు పరిశీలించగా, అందులో శివ, శివ గణేష్, మహేష్ నెంబర్లు కనిపించాయి. తర్వాత బండి సంజయ్ ఫోన్ నెంబర్ కూడా కనిపించింది. ఆరోజు రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించిన సీపీ ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీ కాలేదని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని ప్రకటించారు. అయితే ఈలోగా ప్రభుత్వం శివ ఫోటో తీసిన విద్యార్థిని డిబార్ చేసింది. ఇన్విజిలేటర్ ను డిస్మిస్ చేసింది..
అయితే ఇక్కడే తెలివిగా ప్రభుత్వం బండి సంజయ్ ని తెరపైకి తీసుకొచ్చి అరెస్టు చేసింది.. పనిలో పనిగా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా వింగ్ రకరకాల ప్రచారాలకు దిగింది.. ఇక గులాబీ కరపత్రాలు, చానెళ్ళు బండి సంజయ్ మీద విష ప్రచారానికి దిగాయి. ఒకానొక దశలో నమస్తే తెలంగాణ పేపర్ టెన్త్ తెలుగు పేపర్ లీకేజీలో కూడా బండి సంజయ్ హస్తం ఉందని రాసుకొచ్చింది. ఈ ఎపిసోడ్ తో తెలంగాణ వ్యాప్తంగా ఇన్నాళ్లు చర్చలో ఉన్న ఢిల్లీ మద్యం కుంభకోణం, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారాలు ఒక్కసారిగా పక్కదారి పట్టాయి. అంతేకాదు మొన్నటిదాకా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై ఉమ్మడి స్వరం వినిపించిన ప్రతిపక్షాలు కూడా చెల్లాచెదురయ్యాయి. అంతేకాదు ఈడీ కేసులో ఫోన్లు సమర్పించిన కవిత రాజ్యాంగ సంస్థలను గౌరవించిందని, టెన్త్ హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మాత్రం బండి సంజయ్ ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదని భారత రాష్ట్ర సమితి ప్రశ్నిస్తోంది. ఇదే విషయం మీద గోల గోల చేస్తున్నది.

అయితే ఇటువంటి విషయాలన్నీ బయట చూసేందుకు మాత్రం బాగానే కనిపిస్తాయి. కానీ కోర్టులో వాదించేటప్పుడు పనికిరావు. ఎందుకంటే కోర్టుకు కావాల్సింది ఆధారాలు. ప్రస్తుతం బండి సంజయ్ ఫోన్ పోయిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ప్రభుత్వం వద్ద లేవు. సాక్షాత్తూ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిందీ పేపర్ లీక్ కాలేదని చెప్తున్నారు. అలాంటప్పుడు కోర్టును నమ్మించాలంటే బలమైన ఆధారాలు చూపించగలగాలి. ఇక ఇప్పటికే డి బార్ అయిన విద్యార్థి తన ప్రమేయం లేకుండానే ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసుకుని వెళ్లాడని చెబుతున్నాడు. ఫోటో తీసిన వ్యక్తి శివ కూడా ఇందులో బండి సంజయ్ కి ఎటువంటి ప్రమేయం లేదని వివరిస్తున్నాడు. అన్నప్పుడు లీగల్ గా ఈ కేసు కోర్టులో నిలబడదు. పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి ఫార్వర్డ్ చేశానని బండి సంజయ్ చెబితే… కోర్టు క్షమించి వదిలేస్తుంది. అంటే ప్రభుత్వానికి ఈ విషయంలో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఒకటి ఢిల్లీ మద్యం కుంభకోణం, రెండు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారాలు పక్కకు వెళ్లాయి. అంతే అంతకుమించి ఏమీ లేదు.