
10th Hindi question Paper Leak: రాత్రికి రాత్రే బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. వరంగల్ సిపి రెండుసార్లు ప్రెస్ మీట్ లు పెట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని కామెంట్లు చేశారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ నానా హంగామా చేశాయి. హిందీ పేపర్ మాత్రమే కాదు తెలుగు పేపర్ లీకేజీకి కూడా బండి సంజయ్ కారణమని ఆరోపించాయి. కానీ తీరా చూస్తే సుతిలి బాంబు సామెత అయింది. కవితను ఈ డి విచారించింది కాబట్టి.. దానికి కౌంటర్ గా నేను కూడా మీ రాష్ట్ర అధ్యక్షున్ని జైల్లో వేయించగలను అనే సంకేతాన్ని మాత్రమే కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వగలిగారు. అంతకుమించి ఊదు కాలింది లేదు. పీరి లేచింది లేదు.
అసలు టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజీ అనడమే పెద్ద అబ్జర్డ్.. ఎందుకంటే పరీక్ష కేంద్రాల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ విషయంలో ప్రభుత్వం లైట్ తీసుకుంది. దీంతో పరీక్ష కేంద్రంలోకి గుర్తు తెలియని వ్యక్తి నేరుగా ప్రవేశించాడు. ఫోన్ ద్వారా కోషన్ పేపర్ ఫోటో తీసుకొని అందరికీ ఫార్వర్డ్ చేశాడు. కానీ ఇక్కడ బండి సంజయ్ చేసిన తప్పేంటంటే తనకు వచ్చిన హిందీ క్వశ్చన్ పేపర్ ని చూసి ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం. అది ఇక్కడ ప్రభుత్వానికి తప్పుగా అనిపిస్తోంది. వాస్తవానికి టెన్త్ తెలుగు క్యూస్షన్ పేపర్ లీక్ చేసిన ఉపాధ్యాయుల విషయంలో అంత దూకుడు ప్రదర్శించని పోలీసులు.. బండి సంజయ్ విషయంలో మాత్రం రాత్రికి రాత్రి స్పందించడం విశేషం.. పైగా బండి సంజయ్ ని అరెస్టు చేసిన విధానం, కోర్టుకు తరలించిన విధానంతో ప్రభుత్వం అభాసుపాలైంది.

ఇక ఈ కేసు విచారణకు సంబంధించి న్యాయమూర్తి ప్రభుత్వానికి చురకలు అంటించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత మీదే కదా అంటూ ప్రశ్నించారు. ఒకసారి పబ్లిక్ డిమాండ్ లోకి వచ్చిన దానిని లీకేజ్ అని మీరు ఎలా అంటారని అడిగారు. దీంతో ప్రభుత్వం నీళ్లు నమలాల్సి వచ్చింది. అయితే ఈ కేసులో వరంగల్ సిపి రంగనాథ్ అత్యుత్సాహం ప్రకటించారని బిజెపి నేతలు విమర్శించారు. పైగా జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ వరంగల్ సిపిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే దీనికి వరంగల్ సిపి కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం ప్రభుత్వానికి జరిగిపోయింది. కోర్టు కూడా వెంటనే బెయిల్ ఇవ్వడంతో బండి సంజయ్ ప్రధానమంత్రి పర్యటనలో పాల్గొన్నారు. దీంతో కెసిఆర్ అనుకున్న లక్ష్యం నెరవేరలేదు.
ఇక ఈ కేసు కు సంబంధించి పూర్తిస్థాయిలో సాక్షాధారాలు లేనందువల్ల బండి సంజయ్ ని నేరస్తుడిగా చూపించే అవకాశం ప్రభుత్వానికి లేదు. పైగా హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ సమయంలో సిపి విలేకరులతో మాట్లాడారు. ఇది లీకేజీ కాదని స్పష్టం చేశారు.. బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బండి సంజయ్ పన్నిన కుట్ర అని మాట్లాడారు. అయితే తనను అకారణంగా అరెస్ట్ చేశారని ఇప్పటికే బండి సంజయ్ పలుమార్లు ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉన్నప్పటికీ.. నిలబడలేదని న్యాయవాదులు చెబుతున్నారు.. ఇది కూడా మరో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు లాంటిదేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఈమధ్య కేసీఆర్ ఏది చేసిన ఉత్తిగానే ప్లాప్ అవుతున్నాయి. ఓ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు, కవిత మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీక్..పాపం కెసిఆర్ సుడి బాగా లేనట్టుంది. అందుకే టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అటు కెసిఆర్ దీని గురించి మాట్లాడటం లేదు. బండి సంజయ్ నోరు విప్పడం లేదు. వరంగల్ సిపి పెదవి నుంచి మాట రావడం లేదు. మొత్తానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అనుకోవాలా? లేక తుఫాను ముందు ప్రశాంతత అనుకోవాలా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.