Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో ఇటీవల ఒక చర్చ జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కూటమి పెద్దలకు ఆయన దూరంగా ఉంటున్నారు అనేది ప్రధాన చర్చ. అమరావతి రాజధానిలో కీలక నిర్మాణాల ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. క్యాబినెట్ భేటీకి హాజరు కావడం లేదు. అదే సమయంలో కలెక్టర్ల సదస్సులో సైతం కనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ కూటమికి దూరమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. అప్పుడే మీడియాలో డిబేట్లు సైతం ప్రారంభం అయ్యాయి. అయితే ఇది ఒక నిరంతర ప్రచారంగా ఉంది. గతంలో కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది. కానీ పవన్ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని.. ఎవరెన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అప్పట్లో వ్యతిరేక ప్రచారానికి తెరదించారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కచ్చితంగా దీనిపై మరోసారి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన కార్యక్రమాలు అన్నింటికీ గైర్హాజరవుతుండడంతో ఈ ప్రచారం మరోసారి మొదలైంది.
* అమరావతి ప్రారంభోత్సవాలకు గైర్హాజరు..
అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ను ప్రారంభించారు చంద్రబాబు. స్టీల్ బ్రిడ్జిలను సైతం ప్రారంభించారు. ఆపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సైతం పరిశీలించారు. అయితే రాజధాని లో కీలక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. అమరావతి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ వెళ్లి మరి పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ ఆహ్వానాన్ని మన్నించలేదు. సీఎం చంద్రబాబు ఒక్కరే అమరావతిలో ప్రారంభోత్సవాలు చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాని అనుకూల మీడియా దీనిని ఒక ప్రచారంగా మార్చింది. అయితే అసలు వాస్తవం ఏమిటంటే అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా.. విశాఖలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పవన్ హాజరు కావాల్సి ఉండడంతోనే ఆయన.. అమరావతి ప్రారంభోత్సవాలకు హాజరు కాలేదు.
* స్వాతంత్ర వేడుకలకు..
మరోవైపు అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అమరావతిలో నిర్వహించిన తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దీనికి కూడా పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడంపై రకరకాలుగా ప్రచారం నడిచింది. అయితే మంత్రుల్లో ఏ ఒక్కరూ కూడా అమరావతిలో జరిగిన వేడుకలకు హాజరు కాలేదు. తాము ఇన్చార్జిలుగా ఉన్న జిల్లాల్లో వేడుకలకు మాత్రమే హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రం కాకినాడ లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు.. అమరావతిలో వేడుకలకు రానందున చంద్రబాబుతో గ్యాప్ పెరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తన అనుకూల మీడియా ప్రచారం మొదలు పెట్టింది. అయితే ఏ మంత్రికి ఏ జిల్లా కేటాయిస్తే అదే జిల్లాల వేడుకలకు వెళ్లారు. ఆ పై సాయంత్రానికి గవర్నర్ ఇచ్చే తేనేటి విందుకు సైతం పవన్ గైర్హాజరయ్యారు. కానీ ఆయన జ్వరంతో బాధపడుతుండడంతో హైదరాబాద్ వెళ్లిపోయారని తరువాత తెలిసింది.
* తీవ్ర అనారోగ్యంతో..
పవన్ కళ్యాణ్ మొన్న ఆ మధ్యన తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ముంబైలో ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన నాడు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ తరువాత సైతం పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడిన సందర్భాలే అధికం. మరోవైపు క్యాబినెట్ భేటీలకు సైతం సరిగ్గా హాజరు కాకపోవడానికి అనారోగ్య పరిస్థితులే కారణం. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాని అనుకూల మీడియా మాత్రం కూటమి పెద్దలతో.. కూటమితో పవన్ కళ్యాణ్ కు గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం చేస్తోంది . గతంలోనూ ఇలానే చేసింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బయటకు వచ్చి మరి హెచ్చరికలు జారీ చేశారు. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోసారి కూడా పవన్ ఇదే చెబితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాని అనుకూల మీడియా తోక ముడుచుకోవడం ఖాయం.