
Bandi Sanjay: టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి బెయిల్ వచ్చింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ జిల్లా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలు మొత్తం వీగిపోయినట్టేనా? అసలు ఎందుకు బండి సంజయ్ కి బెయిల్ వచ్చింది? సంజయ్ కి బెయిల్ రాకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయింది? బయటికి వచ్చిన సంజయ్ మళ్ళీ భారత రాష్ట్ర సమితి పై విమర్శల దాడి ఎందుకు పెంచారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ బర్తరఫ్ చేయాలని ఎందుకు డిమాండ్ చేశారు? ఇప్పుడు ఈ ప్రశ్నలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో అసలు ప్రశ్నాపత్రం లీకేజీ కాలేదని ప్రభుత్వమే చెబుతోంది. వరంగల్ కమిషనర్ పోలీస్ రంగనాథ్ కూడా ఈ విషయాన్నే ద్రువీకరిస్తున్నారు. ప్రెస్మీట్లో కూడా అదే విషయాన్ని చెప్పారు. అయితే పేపర్ వాట్సాప్ లో షేర్ చేసిన ప్రశాంత్ తో బండి సంజయ్ గంటల కొద్దీ మాట్లాడారని, పేపర్ లీక్ అయిన వెంటనే బండి సంజయ్ పత్రికా ప్రకటనలు చేశారని వరంగల్ సిపి వివరించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేశారని, దీనిపై మాకు అనుమానాలు ఉన్నాయని సిపి ప్రకటించారు. అయితే బండి సంజయ్ ఫోన్ కనుక మాకు ఇస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని సిపి వివరించారు.

అయితే ఇక్కడ బండి సంజయ్ చాలా తెలివిగా ప్రవర్తించారు. తనను పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగి ఫోన్ పోయిందని బండి సంజయ్ కోర్టుకు విన్నవించారు. అయితే ఈ కేసులో మొదట శివ అనే వ్యక్తి ఓ పదో తరగతి విద్యార్థి ప్రశ్న పత్రాన్ని ఫోన్లో ఫోటో తీశాడు. తర్వాత దానిని శివ గణేష్ అనే వ్యక్తికి వాట్స్అప్ చేశాడు. తర్వాత అతడు మహేష్ అనే వ్యక్తికి ఫార్వర్డ్ చేశాడు. అతడు వాట్సాప్ లోని పదో తరగతి గ్రూప్లో పోస్ట్ చేశాడు. దానిని ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి ఫార్వర్డ్ చేశాడు. అయితే ఈ వ్యవహారంలో ఎక్కడ కూడా బండి సంజయ్ నేరుగా పేపర్ లీక్ చేయించినట్టు పోలీసుల వద్ద ఆధారాలు లేవు. ఈ ఆధారాలు లేవు కనుక సంజయ్ కి కోర్టు బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో పబ్లిక్ డొమైన్లోకి క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా నిలువరిస్తామంటూ కోర్టు అభిప్రాయ పడింది. అయితే కోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
ఒకవేళ ఫోన్ గనుక ఇచ్చి ఉంటే కీలక ఆధారాలు రాబట్టేవారమని పోలీస్ కమిషనర్ వివరించారు. అయితే ఒక వ్యక్తికి సంబంధించిన ఫోన్ ఇవ్వాలి అంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది.. ఫోన్ అప్పగించేందుకు సంబంధిత న్యాయమూర్తి అనుమతి కావాలి.. మద్యం కుంభకోణం విషయంలో కవిత సమర్పించిన ఫోన్లను ఈడి అధికారులు ఆమెకు సంబంధించిన లాయర్ సమక్షంలోనే తెరిచారు. అంతే కానీ ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు..కానీ ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా సిపి బండి సంజయ్ ఫోన్ అడగడమే ఆశ్చర్యం అనిపించింది.. అదే సమయంలో సిపి నోటి వెంట ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని వంటి మాటలు రావడం కూడా విస్మయాన్ని కలిగించింది..
ఇక బండి సంజయ్ ఫోన్ ఇవ్వకపోవడంతో భారత రాష్ట్ర సమితి నాయకులు సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.” మేము దర్యాప్తు సంస్థలకు విలువ ఇస్తున్నాం. వారు విచారణకు రమ్మంటే మేము వస్తున్నాం. మా వ్యక్తిగత ఫోన్లు ఇవ్వమంటే మేము ఇస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు విచారణ సంస్థలు పిలిస్తే హాజరు కావడం లేదు. పైగా కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చుకుంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేస్తే దానిని రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. చివరకు రద్దు చేయించారు. పైగా వారికి నచ్చిన సిబిఐ, ఈడీ ని ఇందులో ఇన్వాల్వ్ చేశారని” భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు.
అయితే ఫోన్ పోయిన విషయంలో సరైన కౌంటర్ ఇచ్చేందుకు బిజెపి దగ్గర ఎటువంటి అస్త్రాలు లేవు. మరోవైపు మొన్నటిదాకా కవిత విషయంలో ఫోన్లు ఇచ్చేందుకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించిన బిజెపి.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఫోన్ల ప్రస్తావన తీసుకు రాగానే మౌనం వహిస్తోంది.. అయితే ఈ విషయంలో మాత్రం భారత రాష్ట్ర సమితి బిజెపిపై పైచేయి సాధించిందనే చెప్పాలి.. బండి సంజయ్ బయటకు విడుదల కాగానే మళ్లీ భారత రాష్ట్ర సమితి పై విమర్శల వేడి పెంచారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రాల లీకేజీ సంబంధించి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైతే ఈ కేసుకు తాత్కాలిక విరామం మాత్రమే లభించింది. మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తారు? భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి కౌంటర్ ఏ విధంగా ఇస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.