
Atchannaidu Letter: అంతా బావుందని అనుకుంటున్నవేళ, తూర్పు టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను ఆ పార్టీ నేతలు పాటించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. క్రమశిక్షణగా మెలగాలని వైసీపీని ఎదుర్కొనేందుకు సమాయత్తం చేస్తున్న తరుణంలో అంతర్గత విభేధాలు నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.
క్రమశిక్షణకు మారు పేరైన తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని అచ్చెన్న విడుదల చేసిన లేఖలో సారాంశం. ఇటీవల కొంత మంది నాయకులు సంబంధం లేకపోయినా, ఇతర నియోజకవర్గాలలో పర్యటిస్తూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తూ, వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన అందులో పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం, ఇష్టానుసారంగా పార్టీని, నాయకులను విమర్శించడం, పార్టీకి సంబంధంలేని నాయకులను కలవడం వంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తప్పవని తేల్చి చెప్పేశారు.
ప్రస్తుతం అధికారికంగా పార్టీ నుంచి విడుదలైన ఆ లేఖ సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. ఎవరికోసం ఆ లేఖ విడుదల చేశారన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఇచ్చారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తుండటంతో నియోజకవర్గంలో అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక రకంగా గ్రూపులు కట్టేందుకు కారణమవుతుంది.

పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న వారికి రాకపోతే ఆ వర్గం అధికార పార్టీకి సహరం అందిస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో నెలకొని ఉంది. నియోజకవర్గాల్లో నెలకొన్న టీడీపీ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్న అచ్చెన్న లేఖ పెద్ద దుమారమే రేపుతుంది. క్రమశిక్షణగా వైసీపీనీ ఎదుర్కొందామన్న చంద్రబాబు పిలుపును ఆ పార్టీ నేతలు పట్టించుకోకపోతే తీవ్ర నష్టం జరగక మానదు. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని అనుకూలంగా మరల్చుకునేందుకు వైసీపీ ఐప్యాక్ టీం కాచుకొని కూర్చొని ఉంది. టీడీపీలో జరిగే ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోంది.