Shantanu Narayan Adobe Resignation Reason: ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ జమానాలో అనేక కంపెనీలు రకరకాల టూల్స్ ను అందుబాటులో తీసుకొచ్చాయి. ఈ క్రమంలో కంపెనీలు కొత్త కొత్త సాంకేతికత వైపు అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అడోబ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాంతను నారాయణ్ తన పదవికి రాజీనామా చేశారు. గడిచిన 18 సంవత్సరాలుగా అడోబ్ కంపెనీలో శాంతను నారాయణ్ పనిచేస్తున్నారు. “ఆ పదవికి తదుపరి వ్యక్తిని గుర్తించేంతవరకు అందులోనే తాను కొనసాగుతానని” శాంతను నారాయణ్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!
శాంతను నారాయణ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. ” స్నేహం, మార్గదర్శకత్వంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. అడోబ్ ప్రస్థానంలో మీరు సమర్థవంతమైన పాత్రను పోషించారు. అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ కంపెనీ గా అడోబ్ ను నిర్మించారు. బ్రాండ్ వ్యాల్యూను పెంచారు. సృజనాత్మక రంగంలో మీరు గొప్ప విలువలను నిర్మించారు. నాయకుడిగా ఎంతో ఉదారత చూపించారు. అడోబ్ పరిశ్రమ కోసం మీరు చేసిన ప్రతి పనికి ధన్యవాదాలు” అంటూ సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
ఎందుకు రాజీనామా చేసినట్టు
శాంతను నారాయణ్ అడోబ్ సంస్థలో కీలకమైన ఉద్యోగిగా పని చేశారు. సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు.. కొంతకాలంగా ఆయన తన ప్రయాణాన్ని మరో దిశకు మార్చుకోవాలని అనుకుంటున్నారు. అందువల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో అడోబ్ సంస్థ విషయంలో యాజమాన్యం ఇంకో విధమైన ప్రణాళికలను రూపొందించాలని అనుకుంటోంది. అందువల్లే శాంతను సంస్థ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
శాంతను నేపథ్యం ఇదే
శాంతను నారాయణ్ హైదరాబాదులో జన్మించారు. ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివారు. హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1998లో అడోబ్ సంస్థలో చేరారు. ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూపునకు ఉపాధ్యక్షుడిగా.. జనరల్ మేనేజర్ గా బాధ్యతలను స్వీకరించారు. 2005లో సీవోవోగా ఎంపికయ్యారు. 2007 నుంచి కంపెనీ సీఈవోగా పనిచేస్తున్నారు. 2017 లో ఆయన బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. అడోబ్ కంటెంట్ ముందు ఆయన ఆపిల్, సిలికాన్ గ్రాఫిక్స్ సంస్థలో పనిచేశారు. ప్రారంభంలో ఫోటో షేరింగ్ స్టార్టప్ ఫిక్ట్రా ను స్థాపించారు.
హురున్ 2025 ధనవంతుల జాబితా ప్రకారం శాంతను నికర ఆస్తుల విలువ 4,670 కోట్లుగా తేలింది. శాంతను రెని అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరు కాలిఫోర్నియాలోని ఫాలో ఆల్టో ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. తన పదవికి రాజీనామా చేస్తున్న క్రమంలో శాంతను కీలక వ్యాఖ్యలు చేశారు.. “ఇది దాదాపు 28 సంవత్సరాల ప్రయాణం. 3000 ఉద్యోగుల నుంచి 30 వేల ఉద్యోగుల వరకు సంస్థను నిర్మించాం. బిలియన్ల కొద్ది కస్టమర్లను సృష్టించుకోగలిగాం. వారికి అత్యంత ఆధునికమైన సాంకేతికతను అందించే డిజిటల్ అనుభవాలను అందించాం. ఆదాయం ఒక బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు పెరిగింది. ఇది మేమంతా కలిసి చేసిన పనిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని” శాంతను పేర్కొన్నారు.
