Revanth Reddy GHMC Plan: హైదరాబాద్ నగరం అంటే ఒకప్పుడు ఒకే ఒక్క గ్రేటర్ జీహెచ్‌ఎంసీ… కానీ ఇప్పుడు మన పాలకులు దాన్ని మూడు ముక్కలు చేసి, ‘మూడు ఆకులు – అరవై నాలుకలు’ అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తాన్ని కలిపి కొడితే దక్కనిది, ముక్కలు ముక్కలు చేస్తే దక్కుతుందన్న ‘డివైడ్ అండ్ రూల్’ సిద్ధాంతాన్ని బహుశా మన నేతలు చరిత్ర పుస్తకాల్లోంచి కాకుండా, డైనింగ్ టేబుల్ మీద ఆపిల్ కోసేటప్పుడు నేర్చుకున్నట్టున్నారు!
Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?
విభజన… ఒక రాజకీయ ఆపరేషన్!
నగరాన్ని విభజించడమంటే కేవలం అడ్మినిస్ట్రేషన్ కోసమే అనుకుంటే మీరు అమాయకులు. అది పక్కాగా ఓట్ల లెక్కల కోసం జరుగుతున్న ‘సర్జికల్ స్ట్రైక్’. వార్డుల పునర్విభజన అంటూ గీతలు గీస్తుంటే, నాయకుల కళ్ళ ముందు మ్యాపులు కనిపించడం లేదు, కేవలం తమకు అనుకూలమైన ఓటర్లు ఏ ఏరియాలో ఉన్నారో అవే కనిపిస్తున్నాయి. మల్కాజ్‌గిరి లాంటి ప్రాంతాల్లో కాస్త కష్టంగా ఉందంటే, వెంటనే అక్కడో కొత్త గీత గీసి, వేరే ప్రాంతాన్ని కలిపి అద్భుతాలు సృష్టించేయాలని ప్లాన్!
99 రోజుల ‘మిరాకిల్’ ట్రీట్మెంట్!
ఎన్నికలు అనగానే వెంటనే గుర్తొచ్చేది ‘అభివృద్ధి’. ఏదో పదేళ్ల పాటు చేసినట్టుగా… ఈ 99 రోజుల ‘స్పెషల్ డ్రైవ్’లో రోడ్లు వేయడం, గుంతలు పూడ్చడం, పెయింటింగులు వేయడం చూస్తుంటే… పాపం హైదరాబాద్‌కు ఇంతకాలం ఏమైంది అనిపించక మానదు. ఓటర్లను ఆకర్షించడానికి సైబరాబాద్‌లో చేస్తున్న హడావుడి చూస్తుంటే, ఎన్నికలయ్యాక ఈ ఫీవర్ మళ్ళీ ఐదేళ్ల పాటు ఆగిపోతుందేమోనన్న అనుమానం రాక తప్పదు.
సెటిలర్ల ఓట్లు… పాతాళంలో ఉన్నా పట్టాల్సిందే!
ఇక ‘సెటిలర్ల’ ఓట్లపై ప్రత్యేక దృష్టి అంటే, ఆ ఓట్లే ఇప్పుడు నగరాన్ని శాసించే అస్త్రాలు. వలస వచ్చిన వారి ఓట్లు ఏ వైపు మొగ్గితే, మేయర్ పీఠం ఆ వైపు కదులుతుందని తెలిసిన నాయకులు, వారితో మళ్ళీ ‘సెటిల్’ అవ్వడానికి కొత్త కథలు అల్లుతున్నారు. ఎన్నికలప్పుడు సెటిలర్లు “ఓటు బ్యాంకు”గా, మిగతా రోజుల్లో “ఏదో ఒక వలస వాసులు”గా మిగిలిపోవడం ఇక్కడ ఆనవాయితీ కదా!
ముగింపు: పీఠం కోసం వేట!
ఒక్క మాటలో చెప్పాలంటే, విడివిడి ఎన్నికల ద్వారా మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలనేది ఒక పెద్ద ‘పాలిటిక్స్ మ్యాథ్స్’. ఒక్కో కార్పొరేషన్‌ను ఒక్కో రకమైన అస్త్రంతో గెలవాలని కాంగ్రెస్ వేస్తున్న ఈ ఎత్తుగడలు… చివరికి ప్రజలకు మేలు చేస్తాయా లేక కేవలం నేతల పీఠాలను స్థిరపరుస్తాయా అనేది కాలమే తేల్చాలి.
ఎందుకంటే, చివరకు గెలిచేది ఏ మేయరో కావచ్చు, కానీ నగరం మాత్రం ఎప్పటిలాగే ట్రాఫిక్ జాంలలో, గుంతల్లో… “తర్వాతి ఎన్నికల కోసం ఎదురుచూస్తూ” అలాగే ఉండిపోతుంది!
