Sampoornesh Babu: సినీ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ ఇటీవల సంపూర్ణేష్ బాబును ఇంటర్వ్యూ చేశారు. ప్రశ్నలు అడిగే క్రమంలో నువ్వు అని సంబోధించారు. ఆ తర్వాత ది ప్యారడైజ్ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది. నీకు ఎటువంటి సినిమా నేపథ్యం లేదు కదా. నువ్వు సినిమాలో నిలబడతావని ఎలా అనుకున్నావ్.. ఇలా రకరకాల ప్రశ్నలు అడిగారు.
నాగేంద్ర కుమార్ అలా ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ సంపూర్ణేష్ బాబు ఏమాత్రం సహనాన్ని కోల్పోలేదు. పైగా సమాధానం చెప్పే సమయంలో సావధానమైన విధానాన్ని ప్రదర్శించారు. అయితే సంపూర్ణేష్ బాబును నాగేంద్ర కుమార్ అలా ప్రశ్నలు అడగడం చాలామందికి నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో నాగేంద్ర కుమార్ మీద విపరీతంగా విమర్శలు రావడం మొదలైంది. కొందరైతే అదేపనిగా నాగేంద్ర కుమార్ ను తిట్టారు. అసలు నువ్వు ఎలా జర్నలిస్ట్ అయ్యావు.. ఇలా ప్రశ్నలు అడగవచ్చా.. అసలు నీకు ఏం అధికారం ఉంది.. నీకు ఎటువంటి నేపథ్యం లేకుండా జర్నలిజంలోకి ఎలా వచ్చావో.. సంపూర్ణేష్ బాబు కూడా అలానే వచ్చారంటూ చాలామంది కామెంట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ వివాదాస్పదం కావడంతో సంపూర్ణేష్ బాబు ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఈ ముఖాముఖీకి సంబంధించిన అనేక విషయాలను ఆయన వెల్లడించారు..” నేను ఇటీవల సినిమా జర్నలిస్టు నాగేంద్రకుమార్ కు ఇంటర్వ్యూ ఇచ్చాను. నాకు ఆయనతో చనువుంది. మా ఇద్దరి మధ్య చాలా సంవత్సరాల పాటు పరిచయం ఉంది. అందువల్లే ఆయన నన్ను ఇంటర్వ్యూలో అలా ప్రశ్నలు అడిగారు. నేను వాటిని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కాకపోతే దీనిని వివాదం చేయకండి. కేవలం ఇద్దరి మధ్య జరిగిన చర్చ మాదిరిగానే చూడండి. నాతోని నాగేంద్ర కుమార్ మాత్రమే కాకుండా చాలామంది సినిమా జర్నలిస్టులు ఇలానే మాట్లాడతారు. వారితో నాకు అలాంటి చనువుంది. దానిని వేరే విధంగా తీసుకోకండి. ఎందుకంటే జర్నలిస్టులు చాలా మంచివారు. వారు వార్తలను రాస్తారు. విషయాన్ని ప్రజలకు చేరవేరుస్తారు. కొన్ని సందర్భాలలో జర్నలిస్టులతో ఉన్న రిలేషన్ వల్ల సన్నిహిత మాటలు వస్తూ ఉంటాయని’ సంపూ వివరించాడు.
సంపూర్ణేష్ బాబు వివరణ బాగానే ఉన్నప్పటికీ.. జనంలోకి ఒక ఇంటర్వ్యూ వస్తున్నప్పుడు వెనుక ముందు చూసుకోవాలి. స్నేహం అనేది తెర వెనుక మాత్రమే ఉంటుంది. తెర ముందుకు వచ్చిన తర్వాత స్నేహం అనేది కనిపించకూడదు. కేవలం ఒక సినిమా స్టార్.. జర్నలిస్ట్ అనే కోణంలో మాత్రమే ఇంటర్వ్యూ సాగాలి. అలాకాకుండా వ్యక్తిగత సన్నిహిత సంబంధాలను ఇంటర్వ్యూలో ప్రతిబింబిస్తే సోషల్ మీడియాలో ఇదిగో ఇలాంటి కామెంట్లు వస్తాయి. సంపూర్ణేష్ బాబు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది.
జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ అన్న గారి ఇంటర్వ్యూ ఇష్యూ పై నా క్లారిఫికేషన్ pic.twitter.com/dL0W5IrToq
— Sampoornesh Babu (@sampoornesh) September 25, 2026