Revanth Reddy Delhi Visit: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఓవర్ టు ఢిల్లీగా మారిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని ఆయన కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ.. చిన్నారెడ్డి భవితవ్యం మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఇటీవల చిన్నారెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకామానికి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని.. డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేగా గెలిచారని చిన్నారెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలు భారత రాష్ట్ర సమితికి ఆయుధంగా మారిపోయాయి. ఆ పార్టీ సోషల్ మీడియా పదేపదే చిన్నారెడ్డి గెలిచిన వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఇబ్బందిగా మారింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఏర్పడడం పట్ల విశ్లేషకులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో నిరసన స్వరాలు పెరిగిపోవడానికి చిన్నారెడ్డి కారణమవుతున్నారని ప్రచారంలో ఉంది.
కొండా సురేఖ కుమార్తె కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో మంట పుట్టించాయి. ఆమె ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కండ్లు నెత్తికి ఎక్కాయంటూ వ్యాఖ్యానించారు. పరకాల సీటు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకాష్ రెడ్డి పేరును ప్రకటించడంతో సురేఖ కుమార్తె సుస్మితలో ఆగ్రహాన్ని కలిగించాయి. పరకాల నియోజకవర్గంలో ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారు. గతంలో సురేఖ పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తనకు పరకాల నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉందని.. ఆ విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా ఎలా ప్రకటిస్తారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థులను అదికూడా ఎన్నికలకు ముందు ప్రకటించే సంస్కృతి ఎక్కడిదని సుస్మిత ప్రశ్నించారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని తీవ్రంగా బాధించినట్టు ప్రచారం జరుగుతుంది. చిన్నారెడ్డిని.. సురేఖను ఆదిలోనే నిలిపివేయలేక పోతే రేవంత్ రెడ్డి ప్రస్తానానికి మరింత ఇబ్బంది ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు ముఖ్య మంత్రి మరింత బలహీనపడతారని.. రేవంత్ రెడ్డి బలహీనపడితే అది కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మంచిది కాదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణను నెలకొల్పాలని.. తద్వారా నిరసన స్వరాలను ఆదిలోనే అణిచివేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఢిల్లీలో జరిగే మీటింగ్ ద్వారా సురేఖ, చిన్నారెడ్డి మీద వేటు వేసే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని సమాచారం. మొత్తానికి ఈరోజు సాయంత్రం చిన్నారెడ్డి.. సురేఖ వ్యవహారంలో ఒక క్లారిటీ వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.