Telangana Congress : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ ఒక మహత్తరమైన ఆఫర్ ఇచ్చింది. “నాయనా రేవంతూ.. నీ కేబినెట్‌లో మూడు ఖాళీలు ఉన్నాయి, నీకిష్టమొచ్చిన వాళ్లతో నింపుకో” అని. కానీ ఆ ‘మూడు కుర్చీల ఆట’ ఇప్పుడు గాంధీ భవన్‌లో పెద్ద ప్రహసనంగా మారింది. పదవులు ఇవ్వడం కంటే, వాటిని ఎవరికీ ఇవ్వకుండా కాలక్షేపం చేయడమే ఆరోగ్యానికి మంచిదని రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బాగా అర్థమైంది.
రెడ్డి గారు VS మిగతా లోకం
ఇప్పటికే కేబినెట్‌లో రెడ్ల హవా నడుస్తోంది. అయినా సరే, “మాకూ ఆ సీటు కావాల్సిందే” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి గారు క్యూలో నిల్చున్నారు. వీరికి ఇస్తే మిగతా వర్గాలు ఊరుకుంటాయా? “మమ్మల్ని బొమ్మలకి పరిమితం చేస్తారా?” అని బీసీ, ఎస్టీ నేతలు కత్తులు నూరుతున్నారు. కొండా సురేఖ గారిని తప్పించాక ఖాళీ అయిన బీసీ సీటు కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య గారు లెక్కలేసుకుంటుంటే, లంబాడా కోటాలో బాలు నాయక్, రామచంద్రు నాయక్ గారలు దరఖాస్తు పట్టుకుని రెడీగా ఉన్నారు. ఇక నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్ నేతలైతే “అసలు మా జిల్లాలకు కేబినెట్‌లో మ్యాప్ ఉందా లేదా?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసమ్మతి బాంబులు… స్థానిక భయాలు!
మూడు పదవులు ఇచ్చి ముప్పై మందితో తిట్లు తినడం ఎందుకన్నది రేవంత్ గారి అసలు భయం. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగాడా మోగబోతోంది. ఈ టైమ్‌లో ఒక్కరికి పదవి ఇచ్చినా, పదవి రాని మిగతా సీనియర్లు బహిరంగంగా మైకులు పట్టుకుని “మాకు అన్యాయం జరిగింది” అని రోడ్డెక్కితే.. అది విపక్షాలకు రెడీమేడ్ బిర్యానీ తినిపించినట్లే అవుతుంది.
వాయిదా మంత్రం… అదే మన తంత్రం!
అందుకే రేవంత్ మార్క్ తెలివితేటలు బయటకు వచ్చాయి. “ఇప్పుడే విస్తరణ ఎందుకులే, మహాప్రభో! ముందు అందరికీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు, నామినేటెడ్ పోస్టులు అని చెప్పి బిస్కట్లు వేద్దాం” అనే ప్లాన్‌లో ఉన్నారట. విస్తరణను వీలైనంత కాలం వాయిదా వేసి, ఆశావహులకు ఆశ చూపించి పని చేయించుకోవడమే కాంగ్రెస్ నయా మార్క్ వ్యూహం! ఏది ఏమైనా, ఈ మూడు బెర్తుల ప్రహసనం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి సాధించడం కంటే, ఆ పదవి ఇవ్వకుండా అందరినీ బుజ్జగించడమే అతిపెద్ద సాహసంలా కనిపిస్తోంది.