Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ బిలాంగింగ్ అనే పేరుతో తన ఆత్మ కథను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని ఢిల్లీలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కి సంబంధించిన ఒక అంశం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేరళ ముఖ్యమంత్రి సతీషన్.. కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్ అటువంటి వారికి ఈ కార్యక్రమంలో అంతగా గుర్తింపు లభించలేదని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ముందు వరుసలో రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే.. సోనియాగాంధీ.. అఖిలేష్ యాదవ్ ముందు వరుసలో కూర్చున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా రాహుల్ గాంధీ పక్కనే కూర్చున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేరళ ముఖ్యమంత్రి సతీషన్.. కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ వంటి వారు వెనుక వరుసలో కూర్చోవలసి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మహారాజా పోషకులుగా రేవంత్ రెడ్డి.. శివకుమార్ కొనసాగుతున్నారు. కేరళ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి అంతగా ఆర్థికంగా సహకారం లభించడం లేదు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. పైగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టింది అంటే దానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. కానీ ఈ విషయంలో అధిష్టానం ఇంతవరకు రేవంత్ రెడ్డికి సముచితమైన స్థానం ఇవ్వలేదని తెలుస్తోంది.
ఇటీవల మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకు రాలి స్థానం నుంచి తొలగించింది. ఆస్థానంలో కొత్త వ్యక్తిని నియమించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన అనుకూలంగా తీసుకున్న నిర్ణయం ఇది ఒకటే కావటం విశేషం. గతంలో రాజ్యసభ ఎంపీల విషయంలో.. ఎమ్మెల్సీల విషయంలో.. టికెట్ల కేటాయింపు విషయంలో.. రేవంత్ రెడ్డి పంపించిన జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. అజహరుద్దీన్.. వివేక్.. ఇంకా కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి మాటను అధిష్టానం పట్టించుకోలేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డికి రెండవ వరుసలో సీటు కేటాయించారంటే.. ఆయనకు అధిష్టానం వద్ద ఏ స్థాయిలో పరపతి ఉందో అర్థం చేసుకోవచ్చని గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు.. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీకి విపరీతమైన ప్రాధాన్యాన్ని రేవంత్ రెడ్డి కల్పించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని గులాబీ పార్టీ నాయకులంటున్నారు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మీద విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఢిల్లీలో రెండవ వరుసలో కూర్చున్నారని మండిపడుతున్నారు.