Pranaya Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రణయ్ అనే ఆరు సంవత్సరాల బాలుడు గుండెపోటుతో చనిపోవడం కలకలం రేపుతోంది.. సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఉదంతంలో దోషులు దొరికిన రోజునే ఈ సంఘటన జరగడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం నెలకొంది.
యూకేజీ ప్రణయ్ మృతి నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ప్రణయ్ మృతికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణయ్ కుటుంబం తిరుమల.. హైదరాబాద్ నగరాలను సందర్శించుకుని వచ్చింది. సరిగ్గా రెండు రోజుల క్రితమే స్వస్థలానికి వచ్చింది. తీర్థయాత్రలు చేయడంతో వారంతా అలసిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రణయ్ ని ఆమె తల్లి మొన్న స్కూలుకు పంపించలేదు. అయితే టూర్ వల్ల హోంవర్క్ చేయకపోవడంతో.. నిన్న కూడా తాను స్కూలుకు వెళ్ళనని ప్రణయ్ చెప్పాడు. అయితే వరుసగా స్కూలుకు డుమ్మా కొడుతున్న నేపథ్యంలో.. తన కొడుకు ఎక్కడ వెనక పడిపోతాడోనని భావించిన తల్లి స్కూల్ కి పంపించింది. స్కూల్ కి వెళ్ళిన ప్రణయ్ ని హోంవర్క్ ఎందుకు చేయలేదని టీచర్ అడిగింది. అతడి చేతిని పట్టుకొని గట్టిగా మందలించింది. దీంతో ప్రణయ్ కింద పడిపోయాడు. అప్పటికే అతడికి గుండెపోటు రావడంతో చనిపోయాడు. కింద పడిపోయినప్పటికీ అక్కడే ఉన్న టీచర్ అతని ముఖం మీద కనీసం నీళ్లు కూడా చల్లలేదు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం ప్రణయ్ తల్లిదండ్రులకు చెప్పలేదు.
మరోవైపు ప్రణయ్ కేసులో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ చంద్రశేఖర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆ సమయంలో ఆ బాలుడికి గుండెపోటు వచ్చిందని భావించలేమని.. ఒత్తిడి పెరిగిపోతే గుండె ఆకస్మాత్తుగా ఆగిపోతుందని.. గతంలో ఎంసెట్ విద్యార్థులకు కూడా ఇలానే జరిగిందని.. ప్రణయ్ తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం వల్లే అతడు ఇలా చనిపోయాడని చంద్రశేఖర్ చెప్తున్నారు. ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ప్రణయ్ గుండె ఎలక్ట్రికల్ షట్ డౌన్ అయి ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు. ఉపాధ్యాయులు పిల్లలతో స్నేహ భావంతో మెలగాలని.. మార్కులు తక్కువ వచ్చినప్పటికీ.. సరిగా చదవకపోయినప్పటికీ సాధ్యమైనంతవరకు ప్రేమతో మందలించాలని.. వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు చంద్రశేఖర్. అలాకాకుండా విద్యార్థుల మీద ఉపాధ్యాయులు ఒత్తిడి తీసుకొస్తే జరిగే పర్యావసనాలు ఇదేవిధంగా ఉంటాయని చంద్రశేఖర్ హెచ్చరిస్తున్నారు.
“పాఠాలు చదవడం ఒకటే జీవితం కాదు. మార్కులు సాధించడం ఒక్కటే పరమార్ధం కాదు. చదువుకుంటే సరిపోతుంది. ఆ చదువును వారు తమ జీవితంలో ఎంతవరకు ఉపయోగించుకుంటారు.. ఏ స్థాయిలో దానిని తమ జీవితానికి అన్వయించుకుంటారు అనే విషయాలు మాత్రమే విద్యార్థుల మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఈ విషయాలను గుర్తించి ఉపాధ్యాయులు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురాకుండా సానుకూల ధోరణిలో బోధన చేయాలి. సాధ్యమైనంతవరకు వారితో స్నేహపూర్వకంగా మెలగాలని” చంద్రశేఖర్ సూచిస్తున్నారు.