Thota Trimurthulu: జనసేన చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కొంతమంది ఇప్పటికే పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. ప్రధానంగా గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తోట త్రిమూర్తులు పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు కానీ.. తెర వెనుక జనసేన కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో ఆయన జనసేనలో చేరుతారని.. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధపడుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ అయితే ఉంది. గతంలో కూడా ఆయన జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ అది జరగలేదు. ఈసారి మాత్రం సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
* టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు తోట త్రిమూర్తులు. ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతగా ఎదిగారు. 1994 ఎన్నికల్లో టికెట్ ఆశించారు తెలుగుదేశం పార్టీ నుంచి.. దీంతో ఆ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలో దిగారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో సైతం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మాత్రం ఓడిపోయారు. 2009 ఎన్నికల ముంగిట చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2012 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో రామచంద్రపురం నియోజకవర్గానికి బైపోల్ జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు త్రిమూర్తులు. 2014 ఎన్నికలకు ముందు మళ్ళీ టిడిపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం దాదాపు పూర్తి అవుతుండడంతో ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* బలమైన కాపు నేత..
గోదావరి జిల్లాలో వైసీపీకి కాపు నేతలు కొద్దిమంది మాత్రమే మిగిలారు.. మొన్నటి ఎన్నికలకు ముందు కొందరు.. ఫలితాలు వచ్చాక మరికొందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ తోట త్రిమూర్తులు మాత్రం వైసీపీలోని కొనసాగుతున్నారు. అయితే వైసీపీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదన్న ఆవేదన ఉంది. పైగా రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఆలోచన చేస్తున్నారు. రామచంద్రపురం టికెట్ వస్తుందా లేదా అన్న బాధ ఉంది. అందుకే జనసేనలోకి వెళితే ఏదో ఒక నియోజకవర్గం సర్దుబాటు చేస్తారన్న ఆలోచనతో ఉన్నారు. త్వరలో ఆయన జనసేనలో చేరికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి తోట త్రిమూర్తులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో..