Konda Murali: తెలంగాణ రాజకీయాలు ఊహకు అందని విధంగా సాగుతున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఆసక్తిగా తెలంగాణ రాజకీయాల వైపు చూస్తున్నారు. గడిచిన 10 రోజులుగా తెలంగాణ రాజకీయాలలో సంచలనాత్మకమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయ్.
పరకాల నియోజకవర్గం నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండ సుస్మితకు ఆగ్రహాన్ని కలిగించింది. ఆమె మరుసటి రోజు తన తల్లి జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కండ్లు నెత్తికి ఎక్కాయని ఆరోపించారు. అంతేకాదు, పరకాల నియోజకవర్గం గురించి తెలియని రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎలా సీటు కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం తెలియకుండా రేవంత్ రెడ్డి ఆ ప్రకటన ఎలా చేశారని ఆమె మండిపడ్డారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెను దుమారాన్ని రేపాయి. ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి అంత సులువుగా తీసుకోలేదు. ఇటీవల కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. చిన్నారెడ్డి.. అనిరుద్ రెడ్డి వంటివారు ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వీరందరికీ ఒకేసారి ఫుల్స్టాప్ పెట్టాలంటే.. గట్టిగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సైడ్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ కూడా రేవంత్ చెప్పినట్టుగానే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని నిర్ణయించింది. ఆ నివేదికను పిసిసి అధ్యక్షుడికి ఇచ్చింది. అంతేకాదు నిన్నటి ప్రెస్ మీట్ లో కూడా రేవంత్ రెడ్డి కొండా సురేఖ వ్యవహారం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఆమె మీద ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
ఇక బుధవారం కొండా మురళి.. ప్రజాభవన్లో భట్టి విక్రమార్కను కలిశారు. కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విక్రమార్కతో దాదాపు గంటపాటు ఆయన ప్రజా భవన్ లో భేటీ అయ్యారు. అయితే అదే సమయానికి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఈ వ్యవహారంలో ఆయన మధ్యవర్తి పాత్ర పోషించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ మరో విధంగా ఉంది. తాను పెండింగ్ బిల్లుల కోసమే విక్రమార్క దగ్గరికి వచ్చానని.. ఈ మధ్యవర్తిత్వంతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి కొండ సురేఖ మీద వేటువేసే అధికారం విక్రమార్కకు లేదు.
ముఖ్యమంత్రి లండన్ నుంచి వచ్చిన తర్వాత.. విక్రమార్కతో సురేఖ అంశం గురించి ప్రస్తావించారు. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు అంతరంగిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే.. తదుపరి ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి విక్రమార్కను కలవడం ద్వారా కొండ వర్గం తగ్గినట్టు కనిపిస్తోంది. ఇటీవలనే సురేఖ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. జరిగిన విషయం గురించి వివరణ ఇచ్చారు. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.