YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వారానికి ఒక్కసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇలా ప్రెస్ మీట్ పెడుతుండడంతో పెద్దగా ఆసక్తికరమైన అంశాలు ఆయన మాట్లాడలేకపోతున్నారు. కనీసం నెలకోసారి ఇలా ప్రెస్ మీట్ పెడితే కొంత కొత్తదనం ఉండేది. పార్టీ నేతలతో ముందురోజు మాట్లాడుతున్నారు. ఆ వీడియోలు బయటకు వస్తున్నాయి. ఆ తరువాత రోజు ప్రెస్ మీట్ పెట్టుకుని కొన్ని రకాల స్క్రిప్టులను చూసి మాట్లాడుతున్నారు. అందులో కొత్తదనం ఏమీ కనిపించడం లేదు. అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పు పట్టడం.. అవి తమ హయాంలోనే బాగా అమలు చేశామని చెప్పడం వంటివి మాత్రమే జరుగుతున్నాయి. ఈ వారాంతపు ప్రెస్ మీట్ లో కూడా అదే పరిస్థితి కనిపించింది.
* బీసీ రిజర్వేషన్లపై విమర్శలు..
బీసీ రిజర్వేషన్ల అంశంపై జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజకీయ విమర్శలు చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో రెండు డిప్యూటీ సీఎం పదవులతో పాటు కేబినెట్ లోని 25 మందిలో 11 మంది బీసీలకు ఇచ్చామని గుర్తు చేశారు. 40 శాతం మంత్రి పదవులకు వారికి కేటాయించామని ప్రస్తావించారు. అప్పట్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధపడితే కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకున్నారంటూ చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో గ్రామాలకు దిగుతోందని ఆరోపించారు. అయితే ఇప్పుడు న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి బీసీ రిజర్వేషన్లు 34% కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానిని స్వాగతించాల్సింది పోయి గతంలో తాను గొప్పగా చేశానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎలా నడుచుకుంది బలహీన వర్గాలకు తెలుసు.
* మెయిన్ మీడియాకు కాకుండా..
జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలు అంటేనే ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు ఆసక్తి తగ్గిపోయింది. మెయిన్ మీడియా కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు, రీల్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నవారికి ఆసక్తి. ఇప్పుడు జగన్ చేసే వ్యాఖ్యలకు.. ఆయన హయాంలో జరిగిన పరిణామాలను జత పోలుస్తూ మీమ్స్ ఓ రేంజ్ లో వేసుకుంటారు. సోషల్ మీడియా తెరిస్తే అదే పనిగా జగన్ పైనే రీల్స్ కనబడుతూ ఉంటాయి. అందుకే వారాంతపు మీడియా సమావేశాలు మాత్రం బోర్ కొడుతున్నాయి. రాతపూర్వక స్క్రిప్టులు చదవడం తప్ప ప్రజలకు కొత్తగా చెప్పేదేమీ లేకుండా పోతోంది. అది కూడా సొంత అనుబంధ మీడియా ఛానల్ లైవ్ కవరేజ్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. జగన్ మీడియా సమావేశాన్ని జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఆయన చెప్పిన దాంట్లో విశ్వసనీయత కంటే మరో కోణంలో వెతుకులాట ఎక్కువగా కనిపిస్తోంది. ఇక తెలుసుకోవాల్సింది ఆయన మాత్రమే.