CM Revanth Reddy: ఆల్రెడీ రేవంత్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖకు లెటర్ రాశాడు. తాను అమెరికా.. లండన్ వెళ్తున్నట్టు చెప్పాడు. అప్పటికప్పుడు రేవంత్ తీసుకున్న నిర్ణయం కాదది. ఆ లెటర్ రాసిన తర్వాతనే.. కొద్దిరోజులు సమయం గడిచిన తర్వాతనే తను విదేశాలకు వెళ్ళాడు. ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకున్నాడు. ఇందులో రహస్యం ఏమీ లేదు.
లండన్ టూర్ లో ఉండగానే.. అమెరికా వెళ్లడానికి రేవంత్ రెడ్డికి కేంద్ర విదేశాంగ శాఖ మోకాలు అడ్డుపెట్టింది. దీంతో లండన్ నుంచి నేరుగా రేవంత్ రెడ్డి తెలంగాణకు రావాల్సి వచ్చింది. దీనిపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. గులాబీ పార్టీ మరో పల్లవి అందుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి లండన్ ప్రాంతంలో కల్వకూడని వ్యక్తులను కలిశాడని.. అమెరికాలో కొంతమంది వేరే వ్యక్తులను కలవడానికి ప్రయత్నాలు చేశాడని ఆరోపణలు మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి అంటే పెద్దగా గౌరవం లేదని.. అందువల్లే కేంద్రం ఇలా చేస్తా ఉందని ఆరోపించడం మొదలుపెట్టింది. ఇక మిగతా వ్యక్తులు రకరకాలుగా విమర్శలు ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
రేవంత్ రెడ్డి మొత్తానికి తెలంగాణకు వచ్చాడు. అసలు తన పర్యటనలో ఏం జరిగిందో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు.”గుజరాత్ ఆధిపత్యానికి ఇది నిదర్శనం. తెలంగాణ పెట్టుబడులను అడ్డుకోవడమే.. సీఎం పర్యటనను అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే.. తెలంగాణ ముఖ్యమంత్రిని అడ్డుకొని బిజెపి నేతలు ఏం చేస్తారు.. నా పర్యటనకు నో చెప్పి.. గుజరాత్ ముఖ్యమంత్రి కి ఎలా అనుమతి ఇస్తారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. నా పర్యటనను అడ్డుకున్నారు. నా లక్ష్యాన్ని అడ్డుకోలేక పోయారు. నన్ను ఆపగలిగారు.. తెలంగాణ అధికారులను నిలువరించలేకపోయారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని” రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు స్వాగతం పలికారు. ఆయనను అనేకమార్లు కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి కావలసిన నిధుల గురించి.. కేటాయించాల్సిన అధికారుల గురించి చర్చించేవారు. కేవలం ప్రధానమంత్రిని కాదు.. కేంద్ర హోం శాఖ మంత్రిని.. ఇతర మంత్రులను కూడా ఆయన కలిశారు. చివరికి గులాబీ పార్టీ నేతలతో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కానీ.. తన పర్యటనకు ఏకంగా కేంద్రం మోకాలు అడ్డడం పట్ల.. రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో కేంద్రం మీద తిరుగుబాటు ప్రదర్శిస్తారని ఎవరూ ఊహించలేదు. ప్రతి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి విలేకరులతో క్లారిటీగా చెప్పేశారు. తాను లండన్ ఎందుకు వెళ్ళింది.. అమెరికాకు ఎందుకు వెళ్లాలి అనుకున్నది.. ఇలా ప్రతి అంశంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి బోనులో బిజెపి పార్టీని నిలబెట్టారు. మరి ఇప్పుడు బిజెపి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.