India vs Sri Lanka Test Series: శ్రీలంకలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా రెండవ విజయానికి దగ్గర అయింది. ఇప్పటికే మొదటి టెస్ట్ గెలిచిన టీమిండియా.. రెండో టెస్ట్ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ సిరీస్ గెలిస్తే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ జాబితాలో నాలుగో స్థానంలోకి చేరుకుంటుంది. ఎందుకంటే ఇటీవల బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా చేతిలో రెండో టెస్టులో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో..నెట్ రన్ రేటు పడిపోయింది. భారత జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే మెరుగైన నెట్ రన్ రేటు సొంతం చేసుకుంటుంది.
గాలే టెస్ట్ లో ఓడిపోయిన శ్రీలంక.. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మైదానాన్ని పూర్తిగా మార్చేసింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తొలి రోజు వన్ డౌన్ ఆటగాడు దేవదత్ పడికల్(117) సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఒక దశలో టీమిండియా 296/5 స్థితిలో ఉండగా.. కొత్త ఆటగాడు సారాంష్ జైన్ (6) త్వరగానే అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన రిషబ్ పంత్.. తను నాచురల్ స్టైల్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ లో మరో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 89 బంతులలో 63 పరుగులు చేసిన అతడు నువంత బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పంత్, జూరెల్ కలిసి ఏడో వికెట్ కు ఏకంగా 112 పరుగులు జోడించారు. తద్వారా టీం ఇండియాను 419/7 స్థితికి తీసుకెళ్లారు. అప్పటికే జూరల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు అత్యంత వేగవంతంగా ఆడాడు. 9 ఫోర్లు.. రెండు సిక్సర్ల సహాయంతో తన కెరియర్లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు చివరి వరకు నాట్ అవుట్ గా నిలిచాడు. సుతార్ కలిసి ఎనిమిదో వికెట్ కు 39.. మహమ్మద్ సిరాజ్ తో కలిసి 9వ వికెట్ కు 31 పరుగులు జోడించాడు. తద్వారా టీమ్ ఇండియా స్కోర్ ను 503 పరుగులకు చేర్చాడు. అప్పటికి టీం ఇండియా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టీమిండియా కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
ఈ మ్యాచ్లో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఫ్లాప్ అయినప్పటికీ.. మిగతా ప్లేయర్లు జైస్వాల్ 45, గిల్ 50, జడేజా 43, పంత్ 63 పరుగులతో ఆకట్టుకున్నారు. దేవదత్ పడికల్ 117, జురెల్ 115 పరుగులు చేసి సంచలనం సృష్టించారు. ఫలితంగా టీమ్ ఇండియా ఏకంగా 503 పరుగులు చేసింది. ఇంకా మూడురోజుల ఆట మిగిలింది. ఉన్నత స్కోరును టార్గెట్ చేయాలంటే శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలి. సుతార్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. భారత బౌలర్లు అదిరిపోయే రేంజ్ లో బంతులు వేస్తున్నారు. ఈ స్టేజిలో శ్రీలంక ఆడాల్సింది గెలుపు కోసం కాదు.. కనీసం డ్రా అయినా అయితే శ్రీలంక పరువు కాస్తలో కాస్త మిగులుతుంది.