Komatireddy Rajagopal Reddy: కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి రావడం.. నీతి వాక్యాలు చెప్పడం.. ఎన్నికల్లో గెలవడం.. మంత్రి పదవి లేదా దానికి సమానమైన హోదాలో కూర్చోవడం తెలుగు రాష్ట్రాలలో కొత్తేమీ కాదు. అన్ని రాజకీయ పార్టీలకు కాంట్రాక్టు సంస్థలు ఇచ్చే చందాలు కావాలి. ఎలాగో చందాలు ఇస్తారు కాబట్టి.. కాంట్రాక్టర్లు కోరిన కోరికలను రాజకీయ పార్టీలు తీర్చాలి. ఇది ఒక సంప్రదాయంగా మారిపోయింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులుగా మారుతున్న సందర్భంగా కొత్తగా ఉంది. గతంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. వీరిద్దరూ కాంట్రాక్టర్లు. కాకపోతే ఇద్దరిది డిఫరెంట్ స్టైల్. వీరు రాజకీయాల్లోకి వచ్చింది సేవ కోసమని చెప్పుకుంటారు గాని.. అంతర్గతంగా జరిగే వివాహారాలు వేరే ఉంటాయి. లోతుల్లోకి వెళ్లడం లేదు గాని మీడియా సర్కిల్లో.. పొలిటికల్ సర్కిల్లో ఆ వ్యవహారాలు అందరికీ తెలుసు.
రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ ప్రకారం చూసుకుంటే తనకు అణువుగా ఉంటే ఎక్కడికైనా వస్తారు. అనుకూలంగా లేకపోతే వదిలేసుకుంటారు. ఇది ఆయన మీద చేస్తున్న ఆరోపణ కాదు. ఆయన సాగించిన రాజకీయ వ్యవహారమే. ఇప్పుడు కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి మంత్రిగా ప్రమోషన్ పొందాలని.. తనకు సెక్యూరిటీ.. ఇతర వ్యవస్థలు కావాలని రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాట బయట పెట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా రవీంద్రభారతిలో ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానం మీద ఒక పుస్తకాన్ని రూపొందించారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ చాలా దూరం వెళ్ళిపోయారు.. అధికారంలో ఉన్నప్పటికీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను ఎప్పటికీ ప్రజాపక్షమని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అలాంటప్పుడు మిగతావారు పాకిస్తాన్ పక్షమా లేదా చైనా పక్షమా.. అనేది రాజగోపాల్ రెడ్డి చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన నైజం తనదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు.. ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు.. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని.. దానికోసం సిద్ధం కావాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.. ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం దోపిడీ చేస్తుంది ఎవరు.. కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పుడు.. అందులో రాజగోపాల్ రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారు.. పైగా ఏపూరి సోమన్నలాంటి కళాకారులు గజ్జలు కట్టాలంట.. ఈయన రుమాలు చుడతారట.. వీరిద్దరూ కలిసి ప్రజల్లోకి వెళ్తారట.. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఎందుకు.. బంధనాలు తెంచుకొని వెళ్ళిపోతే ప్రజలు హారతి పడతారు కదా..
చివరిగా తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని వాళ్ళు.. కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేని వాళ్ళు.. పెద్దపెద్ద పదవుల్లో ఉన్నారని.. రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.. రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. వచ్చేవాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్ళు పోతుంటారు. అక్కడిదాకా ఎందుకు.. రాజగోపాల్ రెడ్డి కూడా బిజెపిలో చేరి.. మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు కదా.. తెలంగాణ ఉద్యమం పదవులకు అర్హత ఎలా అవుతుంది.. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు నైకొట్టిన వాళ్లంతా పదవుల్లో ఉన్నారు కదా.. మరి అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు.. చివరికి గులాబీ పార్టీ కోరుకున్నట్టుగా.. నమస్తే తెలంగాణ అంచనా వేసినట్టుగా రాజగోపాల్ రెడ్డి మాటలు సాగిపోతున్నాయి. గతంలో ఇదే మునుగోడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డి మీద బొగ్గు కాంట్రాక్టులని.. వేలకోట్లు దోచుకున్నారని రాజగోపాల్ రెడ్డి మీద నమస్తే తెలంగాణ.. టీ న్యూస్.. గులాబీ పార్టీ నాయకులు ఎలాంటి విమర్శలు చేశారో రాజగోపాల్ రెడ్డి మర్చిపోతే ఎలా..