Kalvakuntla Kavitha: రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రజలకు హామీలు ఇవ్వడం పరిపాటే. 2000 సంవత్సరం తర్వాత జరుగుతున్న ఎన్నికల నుంచి ఈ సంస్కృతి బాగా పెరిగింది. ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిచాక విస్మరిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం.. గెలిచాక డబ్బులు లేవని చేతులు ఎత్తేయడం పరిపాటుగా మారింది. అయితే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల పార్టీ పెట్టిన సమయంలో కూడా పాంచజన్యం పేరుతో పార్టీ ఎజెండా ప్రకటించారు.
కుటుంబానికి ఎకరం భూమి..
తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో భూమిలేని పేదలకు ఒక ఎకరం భూమి ఇస్తామని కవిత తాజాగా ప్రకటించారు. భూలక్ష్మి పథకం పేరుతో భూపంపిణీ చేస్తామన్నారు. భూపంపిణీ జరగాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇప్పటికే సంక్షేమ పథకాలకు భారీగా నిధులు ఖర్చు చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం ఈ నేపథ్యంలో కవిత హామీ ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నాడు తండ్రి రెండెకరాల హామీ..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నాడు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర్‌రావు తమను గెలిపిస్తే భూమిలేని దళితులకు మూడెకరాల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించారు. కానీ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించినా ఒక్క ఎకరా కూడా పంపిణీ చేయలేదు. ఇక ఇప్పుడు ఆయన తనయ, కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టి ఎకరం భూమి హామీ ఇచ్చారు. కవిత భూమిలేని పేదలందరికీ అని ప్రకటించి సంచలనం రేపారు. ఈ హామీలు ఓటర్లను ఆకర్షించే రాజకీయ వ్యూహంగా కనిపించినా, అమలు విషయంలో గత అనుభవాలు సంతృప్తికరంగా లేవని విమర్శకులు అంటున్నారు.
భారంగా సంక్షేమ పథకాలు..
రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వాటి వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతోందని కోర్టులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా భూమి పంపిణీ హామీ వచ్చిన తర్వాత ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. పథకాల సంఖ్య పెరిగితే అమలు సామర్థ్యం తగ్గుతుందని, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంత భూమి ఎక్కడుంది..
రాష్ట్రంలో ఎంత భూమి అందుబాటులో ఉందనేది కీలక ప్రశ్న. ప్రభుత్వ భూములు, అసైన్‌మెంట్ ల్యాండ్‌లు, వ్యవసాయ యోగ్యమైన స్థలాలు ఎంతవరకు ఉన్నాయో స్పష్టత లేదు. భూమిలేని పేదల సంఖ్య లక్షల్లో ఉండగా, వారందరికీ ఒక్కొక్కరికి ఒక ఎకరం ఇవ్వాలంటే అవసరమైన భూమి పరిమాణం చాలా ఎక్కువ. లభ్యమయ్యే భూమిని ఎలా గుర్తించి, ఎలా పంపిణీ చేస్తారనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.
భూమి పంపిణీ కేవలం హామీతో సాధ్యం కాదు. సర్వే, రికార్డుల అప్‌డేట్, న్యాయపరమైన అడ్డంకులు, స్థానిక వివాదాలు వంటి సవాళ్లు ఉన్నాయి. గతంలో ఇలాంటి పథకాలు ప్రకటించినా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వాస్తవం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కొత్తగా భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయడం కూడా కష్టమే. అందువల్ల ఈ ప్రకటన రాజకీయంగా ఆకర్షణీయంగా ఉన్నా, ఆచరణలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఎక్కువ.