ROKO: ఇప్పటి సమకాలీన క్రికెట్లో టీమిండియా తరఫున లెజెండ్ క్రికెటర్లుగా పేరుపొందారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరిద్దరూ టీమ్ ఇండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు. ఎన్నో చిరస్మరణీయ ట్రోఫీలు అందించారు. తద్వారా తమకంటూ ఒక గొప్ప చరిత్రను.. అద్భుతమైన ఘనతను సృష్టించుకున్నారు.
విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. టి20 ఫార్మాట్ నుంచి కూడా దూరం జరిగారు. విరాట్ కోహ్లీ ప్రైవసీ కోసం తన కుటుంబంతో సహా లండన్ లో ఉంటున్నారు. రోహిత్ శర్మ ముంబైలో ఉంటున్నప్పటికీ.. తన ఆట తీరును మెరుగుపరచుకోవడానికి మరింత ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నప్పటికీ విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్ కనబరుస్తున్నారు. సమయం దొరికితే చాలు మైదానంలోనే కసరత్తులు చేస్తున్నారు. గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నారు. రోహిత్ అయితే తన బరువును పూర్తిగా తగ్గించుకున్నాడు. వయసు పెరుగుతుంటే నవ యువకుడి లాగా కనిపిస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2027 లో వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. ఈ ట్రోఫీ విరాట్ కోహ్లీకి.. రోహిత్ శర్మకు అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే వీరిద్దరూ కెరియర్ చివరి దశలో ఉన్నారు. టీమ్ ఇండియాకు 2027 లో వన్డే వరల్డ్ కప్ ఇవ్వాలని బలమైన నిర్ణయంతో ఉన్నారు. అందువల్లే అనేక రకాల త్యాగాలు చేస్తున్నారు. సామర్థ్యాన్ని కాపాడుకుంటున్నారు. మేనేజ్మెంట్ వీరిద్దరిని 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నీ కోసం ఎంపిక చేయడం దాదాపు ఖాయమే. పైగా వన్డే వరల్డ్ కప్ లో ఆడుతామని వీరిద్దరూ పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. గంభీర్ ఎన్ని రకాలుగా అడ్డు పుల్లలు వేసినప్పటికీ వీరిద్దరూ తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా 2027 వన్డే వరల్డ్ కప్ గురించి విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు. టీమిడియా కోసం తామిద్దరం ఆడే చివరి ప్రపంచకప్ అని.. ఇదే తమ మోటివేషన్ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అంతేకాదు దక్షిణాఫ్రికా గడ్డమీద టోర్నీ మొత్తం ఒకే తీరుగా ఆడటం కాస్త కష్టంగా ఉంటుందని.. అక్కడి మైదానాలు విభిన్నంగా ఉంటాయని విరాట్ వివరించాడు. రోహిత్ కూడా ఇదే విషయంపై విరాట్ కోహ్లీ లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తను ఈ మైదానాల మీద గొప్ప ఇన్నింగ్స్ ఆడాల్సి ఉందని.. దక్షిణాఫ్రికా గడ్డ మీద జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు రోహిత్ చెప్పాడు.
ఈ ప్రకారం చూసుకుంటే వన్డే వరల్డ్ కప్ లో రోహిత్.. విరాట్ ఆడటం ఖాయం. ముఖ్యంగా వీరిద్దరి ఆట తీరు చూసేందుకే అభిమానులు భారీగా వస్తుంటారు. ఐసీసీకి కూడా కావాల్సింది అదే. ఈ విషయంలో గంభీర్ ఎన్ని అడ్డు పుల్లలు వేసినా సరే ఉపయోగముండదు. ఎందుకంటే రోహిత్, విరాట్ మీద ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఉన్న అభిమానం అటువంటిది.