Afghanistan Pakistan Cricket: ఉగ్రవాద తండాలకు.. ఉగ్రవాదులకు ఆలవాలంగా ఉంటుంది పాకిస్తాన్. దేశ ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన పన్నులను ఉగ్రవాదుల సంక్షేమం కోసం వాడుతూ ఉంటుంది. పైగా భారత్ లాంటి దేశాల మీద ఉగ్రవాదులను ప్రయోగిస్తుంది. మనదేశంలో చాలా సంవత్సరాల పాటు దాడులు చేసే నరకం చూపించింది పాకిస్తాన్. 2014 నుంచి క్రమంగా పరిస్థితి మారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల పహల్గాం ప్రాంతంలో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడింది. ఆ ఘటనలో మన దేశానికి చెందిన పర్యాటకులు కన్నుమూశారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది.. పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలను చూస్తుండగానే నేలమట్టం చేసింది.
భారత్ ప్రయోగించిన ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్ కకావికలమైంది. వెంటనే చేతులెత్తేసి సరెండర్ అయింది. ఆ తర్వాత మళ్లీ తాము యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మొదలుపెట్టింది. దీంతో భారత్ ఈసారి పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టడానికి అనేక అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. భారత్ స్థాయిలో సత్తా చూపించే దమ్ము పాకిస్తాన్ కు లేదు. అందువల్లే ఏవేవో లేకి కూతలు కూస్తోంది. వాస్తవానికి పాకిస్తాన్ మహమ్మద్ గజిని టైప్. అతడు మన దేశం మీద 17 సార్లు దండెత్తాడు. 17 సార్లు కూడా ఓడిపోయాడు. వీరావేశంతో రావడం.. భారత్ దాడి చేస్తే మూసుకొని పోవడం.. ఇవే అతడికి పరిపాటి. మహమ్మద్ గజిని వారసత్వాన్ని పాకిస్తాన్ పునికి పుచ్చుకున్నట్టుంది. అందువల్లే తన పిరికితనాన్ని అనేక సందర్భాల్లో ప్రదర్శిస్తోంది.. అంతర్జాతీయ వేదికల మీద పరువు తీసుకుంటున్నది.
మన దేశంతో వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద పడింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులకు తెగ బడింది. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ దానిని అతిక్రమించింది. పాకిస్తాన్ మీద వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి కౌంటర్ గా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై దాడి చేసింది. దీంతో రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. పాకిస్తాన్ చేసిన వైమానిక దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన ముగ్గురు క్రికెటర్లు కనుమూశారు..పక్టికా ప్రావిన్స్ రాజధాని షరానా ప్రాంతంలో ఒక మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా పాకిస్తాన్ వైమానిక దాడులు జరపగా.. ముగ్గురు క్రికెటర్లు మరణించారు.
పాకిస్తాన్ చేసిన ఈ దారుణాన్ని ఆఫ్గనిస్తాన్ తీవ్రంగా పరిగణించింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ దేశంతో క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకుంది. అంతేకాదు పాకిస్తాన్ పర్యటనను రద్దుచేసుకుంది. ఆ దేశంలో జరగాల్సిన టి20 ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య వచ్చే నెల 17 నుంచి 29 వరకు ట్రై టి20 సిరీస్ జరగాల్సి ఉంది. రావలపిండి, లాహోర్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. గడిచిన నెలలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ ప్రకటించింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ ఘటనను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ సంఘం దారుణంగా భావించింది.. జరిగిన దారుణానికి చింతించాల్సింది పోయి.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆఫ్ఘనిస్తాన్ బదులుగా మరో దేశాన్ని ఆహ్వానిస్తామని చెప్పడం విశేషం. గతంలో పాకిస్తాన్లో శ్రీలంక ప్లేయర్లు పర్యటించగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో శ్రీలంక ప్లేయర్లు వెంట్రుకవాసిలో ప్రాణాలను దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక ప్లేయర్లు పాకిస్తాన్ వెళ్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది..
ట్రై సిరీస్ నుంచి తప్పుకున్న ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ మీద దాడులకు సిద్ధమైంది. పాకిస్తాన్ సైనికుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టింది. బంతి, బ్యాట్ తో కాకుండా తుపాకులతోనే పాకిస్తాన్ దేశానికి గుణపాఠం చెప్పాలని ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ వద్ద బలమైన సైన్యం లేకపోయినప్పటికీ దాడులు చేయడంలో వారు సిద్ధహస్తులు. అయితే వారికి సరైన స్థాయిలో సమాధానం చెప్పడంలో పాకిస్తాన్ సైనికులు నిత్యం విఫలమవుతూనే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ దాడి చేయడానికి రాగానే పాకిస్తాన్ సైనికులు చేతులు ఎత్తేస్తున్నారు. ఆ తర్వాత కొద్దిగంటలలోనే మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిత్యం అతిక్రమిస్తున్నారని ఆఫ్ఘనిస్తాన్ మీడియా చెబుతోంది. ఇటీవల పహల్గాం ఘటన చోటు చేసుకున్న తర్వాత టీమిండియా పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్, పాకిస్థాన్లో క్రికెట్ సిరీస్ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఇప్పుడు అదే విధానాన్ని ఆఫ్గనిస్తాన్ కూడా పాటిస్తోంది.