India Vs Australia: టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఒక అదృష్టమైతే… తుది జట్టులో స్థానం సంపాదించుకోవడం మరొక అదృష్టం. అయితే ఈ అదృష్టం తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి లభించింది. ఆస్ట్రేలియాతో జరిగే ద్వైపాక్షిక సిరీస్ లో అతడికి చోటు లభించింది. దీంతో అతడు వన్డేలలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
గత ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ప్రఖ్యాత మెల్ బోర్న్ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. సిరీస్ మొత్తంలో సత్తా చాటాడు. గొప్ప గొప్ప ప్లేయర్లు మొత్తం విఫలమవుతున్నప్పటికీ నితీష్ స్థిరంగా నిలబడ్డాడు. దృఢమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే అతడికి ప్రస్తుతం జరిగే ద్వైపాక్షిక సిరీస్ లో అవకాశం లభించింది.
పెర్త్ వేదికగా తొలి వన్డేను ఆస్ట్రేలియా, టీమిండియా ఆడుతున్నాయి.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పెర్త్ వేదికగానే మొదలైంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా తన టెస్ట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు వన్డే ప్రస్థానాన్ని కూడా అతడు పెర్త్ వేదికగా జరిగే మ్యాచ్ ద్వారా మొదలు పెట్టబోతున్నాడు.. ఇప్పటికే అతనికి రోహిత్ శర్మ జట్టులోకి ఆహ్వానం పలికాడు. అతడికి టీమిండియా క్యాప్ బహూకరించాడు. జట్టులోకి ప్లేయర్లు మొత్తం అతనికి ఘన స్వాగతం పలికారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి గాయాల బారిన పడ్డాడు. ఐపీఎల్ లో కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత డొమెస్టిక్ టోర్నీలు ఆడాడు.. వెస్టిండీస్ సిరీస్ లో పర్వాలేదనిపించాడు. దీంతో అతనిలో ఉన్న ఆటతీరుకు మరింత నైపుణ్యం అందించాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడు. దానికి తగ్గట్టుగానే అతడికి అవకాశాలు ఇచ్చాడు. వాస్తవానికి నితీష్ కంటే కూడా తిలక్ వర్మ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అటువంటి ఆటగాడిని కూడా కాదని నితీష్ కు గౌతమ్ గంభీర్ అవకాశం కల్పించడం విశేషం.
పెర్త్ వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి ఆడడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అతడు తుది జట్టులోకి వస్తే మిడిల్ ఆర్డర్ లో ఆడతాడా? లోయర్ ఆర్డర్ లో రంగంలోకి దిగుతాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో నితీష్ బంతితో కూడా ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ మాదిరిగానే ఆస్ట్రేలియా మైదానాలు కూడా ఉంటాయి. అందువల్లే నితీష్ ను తుది జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. నితీష్ బౌలింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి.. కులదీప్ లేదా అక్షర్ కు తోడుగా ఉంటాడని మేనేజ్మెంట్ భావిస్తోంది.