mohammad nawaz : వేసింది నాలుగు ఓవర్లు.. అందులో ఒక ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. 19 పరుగులు ఇచ్చి.. 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ప్రతి బౌలర్ కలగనే స్పెల్ ఇది. బహుశా ఇది పరిమిత ఓవర్లు.. సుదీర్ఘ ఫార్మాట్లో సాధ్యమవుతుందేమో గాని.. పొట్టి ఫార్మాట్లో వీలు పడదు. కానీ దీనిని నిజం చేసి చూపించాడు. అలాగని అతడు టీమ్ ఇండియా బౌలర్ కాదు. ఆస్ట్రేలియా బౌలర్ అంతకన్నా కాదు. న్యూజిలాండ్ జట్టుకు ఆడుతున్న వాడు కాదు.. సౌత్ ఆఫ్రికా లో సత్తా చాటుతున్న వాడు కాదు.. ఈ ఘనత సాధించింది పాకిస్తాన్ బౌలర్ అంటే నమ్ముతారా.. మీరు నమ్మినా నమ్మకపోయినా… సగటు బౌలర్ కోరుకునే అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు పాకిస్తాన్ బౌలర్ నవాజ్.
ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో యూఏఈ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కొంతకాలంగా సరైన విజయం లేక.. ట్రోఫీలు అందుకోలేక పాకిస్తాన్ తీవ్ర విమర్శల పాలవుతోంది. కీలకమైన ఆటగాళ్లు ఆకట్టుకోకపోవడంతో పాకిస్తాన్ పరువు పోగొట్టుకున్నది. ఈ దశలో పాకిస్తాన్ జట్టుకు వజ్రాయుధం లాగా దొరికాడు నవాజ్. అద్భుతమైన బంతులు వేస్తూ.. బంతులను అద్భుతంగా మెలి తిప్పుతూ.. అనితర సాధ్యమైన విజయాన్ని అందించి.. పాకిస్తాన్ జట్టుకు స్టార్ అయిపోయాడు నవాజ్. టి20 142 పరుగులు పెద్ద లక్ష్యం కాకపోయినప్పటికీ.. దానిని నిలుపుకునేలా చేశాడు నవాజ్. సంచలమైన ఆట తీరుతో పెద్దపెద్ద జట్లకు సైతం చుక్కలు చూపించిన ఆఫ్గనిస్తాన్ కు నిద్రలేని రాత్రిని పరిచయం చేశాడు నవాజ్. ఆసియా కప్ ప్రారంభం ముందు నవాజ్ ప్రదర్శన పాకిస్తాన్ జట్టుకు ఆనందాన్ని కలిగిస్తుంటే.. ప్రత్యర్థి జట్లకు మాత్రం వణుకు పుడుతోంది.
యూఏఈ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆఫ్గనిస్తాన్ 66 పరుగులకే కుప్పకూలింది. వాస్తవానికి టైటిల్ పోరులో ఆఫ్ఘనిస్తాన్ ఇలా చేతులెత్తేస్తుందని ఎవరు ఊహించలేదు. పవర్ ప్లే లోనే ఆఫ్ఘనిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయింది. భీకరమైన ఫామ్ లో ఉన్న గురుబాజ్ అబ్రార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అటల్ కూడా అదే దారిని అనుసరించాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన నవాజ్ ధర్విష్ రసూల్, అజ్మతుల్లా ఓమర్ జాయ్, ఇబ్రహీం జద్రాన్ ను వర్ష బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. దీంతో అప్పటిదాకా 32/2 వద్ద ఉన్న ఆఫ్గనిస్తాన్ పరిస్థితి ఒక్కసారిగా 32/5 కు దిగజారింది. ఇక్కడితోనే నవాజ్ ఆగిపోలేదు. మరో మూడు పంతులు తర్వాత కరీం జనత్ ను అవుట్ చేసి డబుల్ వికెట్ మేడ్ ఇన్ పూర్తి చేశాడు.. అంతేకాదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా రషీద్ ను ఐదో వికెట్ రూపంలో అవుట్ చేశాడు నవాజ్. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కూడా త్వరగానే అవుట్ అయ్యారు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు పొట్టి ఫార్మాట్లో రెండవ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. బంతితో మాత్రమే కాకుండా బ్యాట్ తో కూడా నవాజ్ అదరగొట్టాడు. 21 బంతుల్లో 25 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కాగా, గతంలో విరాట్ కోహ్లీ చేతిలో నవాజ్ బలైపోయాడు. ఇతడి బౌలింగ్లో విరాట్ కోహ్లీ వీర విహారం చేశాడు. ఫలితంగా అప్పట్లో నవాజ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. అతడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. అయితే తన బౌలింగ్ లయను పూర్తిగా మార్చుకొని ఇప్పుడు ఏకంగా జట్టుకు ట్రోఫీ అందించాడు నవాజ్. పోగొట్టుకున్న చోట వెతుక్కొని పాకిస్తాన్ జట్టు తరుపున హీరోగా నిలిచాడు.