India Vs Australia: సమకాలీన క్రికెట్ చరిత్రలో సమఉజ్జీ జట్లుగా వెలుగొందుతున్నాయి భారత్, ఆస్ట్రేలియా. ఈ రెండు జట్ల మధ్య పోటీ కొంత కాలంగా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. గతంలో ఐసీసీ టోర్నమెంట్లు నిర్వహించినప్పుడు కంగారు జట్టు మనమీద స్పష్టమైన అధిక్యాన్ని ప్రదర్శించింది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా కంగారు జట్టు మన మీద విజయం సాధించింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద భారత్ గెలవగా.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం కంగారు జట్టు విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ ఓటమి టీం ఇండియా ప్లేయర్లకు చాలా కాలం పాటు దుఃఖాన్ని మిగిల్చింది.
ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా ఐసీసీ నిర్వహించిన రెండు మెగా టోర్నీలలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా పై విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా టీమ్ ఇండియా అద్భుతమైన గెలుపును అందుకొని అదరగొట్టింది. టి20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాను రెండుసార్లు ఓడించి ఫైనల్ దాకా వెళ్లి.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లను మట్టి కరిపించి t20, ఛాంపియన్స్ ట్రోఫీలను అందుకుంది.
ఇక ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో తలపడుతోంది. పోటీపరంగా ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ కొనసాగడం ఖాయం. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్లను ఒకసారి పరిశీలిస్తే.. ఆస్ట్రేలియాది స్పష్టమైన అప్పర్ హ్యాండ్ కనిపిస్తోంది. వన్డేలలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య హెడ్ టు హెడ్ 152 మ్యాచులు జరిగాయి. ఇందులో ఇండియా 58, ఆస్ట్రేలియా 84 మ్యాచ్లలో విజయాలు సాధించాయి.
ద్వైపాక్షిక సిరీస్లలో ఆస్ట్రేలియా ఎనిమిది, ఇండియా ఏడు సిరీస్ లను సొంతం చేసుకుంది.. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు టీమిండియా, కంగారు జట్ల మధ్య 54 పరిమిత ఓవర్ల మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఇండియా 14, ఆస్ట్రేలియా 38 మ్యాచులలో విజయాలు సాధించాయి. అయితే ఈసారి ఎలాగైనా ఆస్ట్రేలియాకు చెక్ పెట్టి సిరీస్ సొంతం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని కసితో ఉంది.