Traffic Rules: ప్రస్తుతం చాలామంది వాహనదారులు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పీయూసీ వంటి పత్రాలను ఫిజికల్‌గా వెంట తీసుకెళ్లడం లేదు. వాటికి బదులుగా డిజీలాకర్ లేదా ఎం-పరివాహన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పత్రాలను భద్రపరుచుకుని, అవసరమైనప్పుడు మొబైల్‌లో చూపిస్తున్నారు. అయితే ఫోన్ కూడా వెంట లేకపోతే లేదా బ్యాటరీ అయిపోతే పరిస్థితి ఏంటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇలాంటి సమయంలో పోలీసుల తనిఖీలు ఎదురైతే కచ్చితంగా ఫైన్ విధిస్తారు. అయితే ఈ ఫైన్ కూడా పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ 139 ప్రకారం.. పోలీస్ అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చిన అధికారి అడిగినప్పుడు వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ , ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర సంబంధిత పత్రాలను చూపించాలి. అయితే ఆ సమయంలో పత్రాలు తన వద్ద లేకపోతే వాటిని తర్వాత సమర్పించే అవకాశం ఈ నిబంధన కల్పిస్తోంది.
పోలీసుల తనిఖీల సమయంలో పత్రాలు అందుబాటులో లేకపోతే రూల్ 139 ప్రకారం డిమాండ్ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు సంబంధిత పత్రాలను సమర్పించవచ్చు. నిబంధన ప్రకారం పత్రాల ధ్రువీకరించిన ఎక్స్‌ట్రాక్ట్‌లను వ్యక్తిగతంగా సమర్పించవచ్చు లేదా డిమాండ్ చేసిన అధికారికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపవచ్చు. అంటే.. తనిఖీ సమయంలో వెంటనే పత్రాలు చూపించలేక పోయినంత మాత్రాన ఆ పత్రాలు అసలు లేవని అర్థం కాదు. చట్టం నిర్దేశించిన విధంగా తర్వాత వాటిని సమర్పించే అవకాశం ఉంది. అయితే పత్రాలు నిజంగా చెల్లుబాటు అయ్యేవిగా ఉండటం, నిర్ణీత విధానంలో సమర్పించడం చాలా ముఖ్యం.
అయితే ఇలా 15 రోజుల్లో పత్రాలు చూపిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఫైన్ ఉండదని కొందరు అంటున్నారు. రూల్ 139 ప్రధానంగా పత్రాలు వెంట లేని సమయంలో వాటిని తర్వాత సమర్పించే విధానాన్ని చెబుతుంది. వాహనానికి అసలు చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోవడం.. గడువు ముగిసినా కూడా పత్రాలు, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి వాటికి వర్తించే జరిమానాలు వేరుగా ఉండవచ్చు.
ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మొబైల్ తీసుకెళ్లాలి. వాహన పత్రాలను డిజిటల్ రూపంలో చూపించడానికీ చట్టపరమైన గుర్తింపు ఉంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. డిజీలాకర్, ఎం-పరివాహన్‌లోని చెల్లుబాటు అయ్యే పత్రాలను ఫిజికల్ పత్రాలతో సమానంగా పరిగణించాలి. రూల్ 139లో చేసిన మార్పుల ద్వారా ఆర్సీ, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, పీయూసీ వంటి పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించే అవకాశం కల్పించారు.