Suryakumar Yadav poor form : వైట్ బాల్ ఫార్మాట్ లో ముఖ్యంగా టి20 లలో సూర్య కుమార్ యాదవ్ కు తిరుగులేదు. ఎందుకంటే అతడు టి20లలో నెలకొల్పిన రికార్డులు అటువంటివి. కొన్ని సందర్భాలలో t20 ఫార్మాట్ మొత్తాన్ని అతడు ఏలేశాడు. బీభత్సంగా పరుగులు తీసి నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతడు మైదానంలోకి వస్తున్నాడు అంటేనే.. ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఇబ్బంది పడేవారు. వికెట్లు తీయడాన్ని పక్కనపెట్టి.. పరుగులు నిలువరిస్తే చాలు అనుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సూర్య కుమార్ యాదవ్ సూర్య ప్రతాపాన్ని మర్చిపోయి చాలా రోజులైంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో సూర్య కుమార్ యాదవ్ యావరేజ్ 14. ఒక మామూలు ఆటగాడు కాదు.. కనీసం ఒక బౌలర్ కూడా ఇంతటి దిగువ స్థాయి యావరేజ్ మైంటైన్ చేయలేడు. నిప్పులు కురిపించే విధంగా బ్యాటింగ్ చేసే సూర్యకుమార్ యాదవ్ ఇలా ఎందుకు మారిపోయాడు.. ప్రత్యర్థి బౌలర్లకు అంత సులభంగా ఎందుకు దొరికిపోతున్నాడు.. ఈ విషయాలు అర్థం కాక ముంబై మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటున్నది. సాధారణంగా ఐపీఎల్ అనేది పూర్తి కమర్షియల్ గేమ్. ఇందులో ఫామ్ లో ఉంటే ఆటగాడికి విలువ ఉంటుంది. సూర్య కుమార్ యాదవ్ లాంటి ఆటగాడు ఆడకపోయినప్పటికీ విలువ ఉంటుంది. ఎందుకంటే ఒక సీజన్లో ఫ్లాప్ అయినా సరే.. మరో సీజన్లో ఆకట్టుకుంటాడని మేనేజ్మెంట్ నమ్ముతుంది. కానీ జాతీయ జట్టులో అలా ఉండదు.
జాతీయ జట్టులో ఒక స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. ఉదాహరణకు రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్లో అంతగా ఆడకపోయేసరికి.. అతడిని ఏకంగా పక్కన పెట్టారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోమని చెప్పారు. రోహిత్ నాయకత్వంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా వెళ్ళింది. అంతటి స్థాయి ఉన్న ఆటగాడిని సైతం మేనేజ్మెంట్ పక్కన పెట్టిందంటే.. జాతీయ జట్టులో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సూర్య కుమార్ యాదవ్ మినహాయింపు కాదు. అలాగని బీసీసీఐ కేవలం ఐపిఎల్ మాత్రమే పరిగణలోకి తీసుకోదు.
2025లో సూర్య కుమార్ యాదవ్ 50.. 2025లోనే జరిగిన ఆసియా కప్ లో అతని యావరేజ్ 15. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ యావరేజ్ 13. ప్రస్తుత ఐపిఎల్ లో సూర్యకుమార్ యాదవ్ యావరేజ్ 14. ఇవేమీ గొప్ప గణాంకాలు కాదు. సూర్య కుమార్ యాదవ్ లాంటి ఆటగాడు కొనసాగించే గణాంకాలు అస్సలు కావు.. సూర్య కుమార్ యాదవ్ టి20 లలో అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. టీమ్ ఇండియాకు మరపురాని విజయాలు అందించాడు. కానీ అతడి వ్యక్తిగత ప్రదర్శన మాత్రం గొప్పగా లేదు. అతడి స్థానానికి విపరీతమైన పోటీ ఉంది.
అయ్యర్ ప్రస్తుత ఐపిఎల్ లో పంజాబ్ జట్టును సింహం లాగా పరుగులు పట్టిస్తున్నాడు. తను కూడా దూకుడు మీద ఆడుతున్నాడు. ఇప్పటికే వన్డే ఫార్మాట్లో అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో టి20 కూడా ఉందని తెలుస్తోంది. అదే గనక జరిగితే సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మేట్ లో సాధారణ ఆటగాడిగా మిగిలిపోవాలి. ఒకవేళ అదే గనుక జరిగితే సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.