CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల హామీలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి దశలవారీగా కేటాయింపులు జరుపుతున్నారు. ఇటీవల తాయి మామన్ తంగ మోతిరం అనే పథకానికి శ్రీకారం చుట్టారు విజయ్. సెప్టెంబర్ 15 నుంచి ఈ పథకాన్ని విజయ్ అధికారికంగా ప్రారంభించబోతున్నారు.
ఈ పథకం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ప్రతి శిశువుకు ప్రభుత్వం తరఫున గ్రాము బంగారాన్ని అందజేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచడానికి ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో సెప్టెంబర్ నెల వరకు 1,28,499 శిశువులకు ఒక గ్రాము చొప్పున బంగారు ఉంగరాలు ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ బంగారం ఉంగరాలు తయారు చేయడానికి కళ్యాణ్ జువెలర్స్.. జోయ్ అలుకాస్ ముందుకు వచ్చాయి. వీటిలో ఒక్క ఉంగరాన్ని తయారు చేయడానికి పైసా ఖర్చుతో అతి తక్కువ కోడ్ చేసిన జోయాలుకాస్ కు తయారీ బాధ్యతలు అప్పగించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక గ్రాము బంగారాన్ని ఉంగరం లాగా మార్చాలి అంటే దాదాపు 1,045 రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఇంత ఖర్చును కూడా పక్కనపెట్టి కేవలం పైసాకు మాత్రమే బంగారు ఉంగరాన్ని తయారు చేయడానికి జోయ్ అలుకాస్ ముందుకు రావడం విశేషం. అయితే ఈ ఉంగరాల తయారీలో 70% జోయ్ అలుకాస్ కు.. మిగతా 30 శాతం కళ్యాణ్ జ్యువెలర్స్ కు తమిళనాడు ప్రభుత్వం అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే ఇంత తక్కువకు బంగారు ఉంగరాలు తయారు చేయడం వెనుక కారణం వేరే లేదని.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ గొప్ప పథకానికి తమ వంతు బాధ్యతగా అందించడమేనని జోయ్ అలుకాస్ కంపెనీ చెబుతోంది.. మొత్తంగా ఈ పథకం ద్వారా పేద పిల్లలకు బంగారం లభిస్తుందని.. ఇది తమిళనాడు చరిత్రలోనే గొప్ప పథకం లాగా నిలిచిపోతుందని అధికార పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
విజయ్ ప్రకటించిన ఈ పథకాన్ని అమలు చేయడం కష్టమని మొదట్లో డిఎంకె నేతలు ఆరోపించారు. కానీ విజయ్ ఈ పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. ఎన్నికల సమయంలో తాను ప్రకటించిన హామీల అమలుకు సంబంధించి కూడా ఆయన నిధులు కేటాయించారు. మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చడానికి విజయ్ గట్టి కంకణం కట్టుకున్నారు.