CM Vijay: ఇటీవల 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. తమిళ ప్రజల మీద వరాలజల్లు కురిపించారు. కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు. మిగతా పథకాలను గ్రౌండింగ్ చేసే స్టేజ్లో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ .. ఇప్పుడు శాసనసభ సభ్యుల మీద విజయ్ వరాలజల్లు ప్రకటించారు.
బుధవారం శాసనసభలో జరిగిన సమావేశంలో విజయ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రతి ఎమ్మెల్యేకు కొత్త కారును ప్రకటించారు. కారుతోపాటు డ్రైవర్ జీతం.. ఇంధన ఖర్చులకోసం ఈ నెలకు 75 వేల రూపాయలు అదనపు భత్యం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేకు అసిస్టెంట్ లో నియమించుకోవడానికి నెలకు 25000 అందిస్తున్నట్టు వివరించారు. అయితే ఈ నిర్ణయాన్ని విజయ్ అప్పటికప్పుడు తీసుకున్నారు. వీసీకే పార్టీ ఎమ్మెల్యే జ్యోతిమణి తన సమస్యను విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విజయ్ వెంటనే స్పందించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఎమ్మెల్యేల కష్టాల మీద విజయ్ ఇంత వేగంగా స్పందించడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేల సమస్యల మీద ఇంత వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రజల సమస్యల మీద ఎందుకు స్పందించడం లేదని తమిళ ప్రజలు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. “వేలకోట్ల ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలకు ఇన్ని వరాలు అవసరమా.. మేం సమస్యలతో బాధపడుతుంటే సవా లక్ష కండిషన్లు పెడుతుంటారు. ఎంతోమంది అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం విజయ్ వరాలు ప్రకటించారు. అడిగినవి.. అడగనివి కూడా ఇచ్చారు. ప్రభుత్వం సొమ్మును పప్పు బెల్లం మాదిరిగా పంచిపెట్టారు. ఇలా అయితే ప్రజలు ఏ ప్రభుత్వాన్ని నమ్ముకోవాలి.. ఏ వ్యక్తిని తమ నాయకుడిగా ప్రకటించాలి.. అన్ని పార్టీలు మమ్మల్ని మోసం చేశాయి. చివరికి విజయ్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం లభించింది అనుకున్నాం. కానీ ఆయన కూడా రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఇక మాకు జరిగే ప్రయోజనం ఏముందని” తమిళ ప్రజలు అంటున్నారు.
వాస్తవానికి గత ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలకు భత్యాలు.. ఇతర ఖర్చులను ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు గరిష్టంగానే లభిస్తోంది. అయినప్పటికీ అలవెన్స్ల విషయంలో.. ఇతర చెల్లింపుల విషయంలో చేతికి ఎముక లేదన్నట్టుగా విజయ్ ప్రభుత్వం వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేలకు ఇలాంటి వరాలు ప్రకటించడం పట్ల అక్కడి ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని.. ఎమ్మెల్యేల కోసం కాదని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు అంటే విజయ్ తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.