Redmi 17C : బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తున్న షియోమీ.. తాజాగా Redmi 17Cని మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతేడాది విడుదలైన Redmi 15Cకి ఇది సక్సెసర్‌గా వచ్చింది. అయితే కొత్త మోడల్‌లో పెద్దగా హార్డ్‌వేర్ మార్పులు కనిపించకపోవడం గమనార్హం. డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసినప్పటికీ.. ప్రాసెసర్, కెమెరాలు, డిస్‌ప్లే, బ్యాటరీ వంటి కీలక స్పెసిఫికేషన్లు దాదాపు అవే ఉన్నాయి. అయితే పెరుగుతున్న మెమరీ ధరల నేపథ్యంలో Redmi 17C ధర మాత్రం గణనీయంగా పెరిగింది.
ధర ఎంతంటే?
Redmi 17C బేస్ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్తో రూ.20,999 ధరకు లభిస్తుంది. ఇక 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. ఇదే సమయంలో గతంలో రూ.12,499కు లాంచ్ అయిన Redmi 15C ధర ఇటీవల పెరిగి ప్రస్తుతం రూ.18,499గా ఉంది. దీంతో కొత్త ఫోన్ కోసం అదనంగా రూ.2,500 వరకు చెల్లించాల్సి వస్తోంది.
డిజైన్, బిల్డ్ క్వాలిటీ
Redmi 17Cని Coffee Brew కలర్‌లో తీసుకొచ్చారు. ఈ వేరియంట్ వెనుక భాగంలో లెదర్ తరహా టెక్చర్డ్ ఫినిష్ ఉండటం వల్ల చేతిలో మంచి గ్రిప్ లభిస్తుంది. కెమెరా మాడ్యూల్, ఫ్రేమ్‌ను పాలీకార్బొనేట్‌తో రూపొందించారు. ఫోన్ బరువు 211 గ్రాములుగా ఉంది. ఇది IP64 రేటింగ్తో వస్తుంది. అంటే దుమ్ము నుంచి మంచి రక్షణతో పాటు నీటి చిమ్ముర్లను కొంతవరకు తట్టుకోగలదు.
ఫోన్‌లో రెండు Nano SIMలతో పాటు ప్రత్యేక microSD కార్డ్ స్లాట్ కూడా ఉంది. దీని ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. పవర్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type-C పోర్ట్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.
6.9 అంగుళాల డిస్‌ప్లే
Redmi 17Cలో 6.9 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. 700 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. డిస్‌ప్లే గరిష్ఠంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 810 నిట్స్ వరకు చేరుతుంది. డిస్‌ప్లేలో DC Dimming సపోర్ట్ కూడా ఉంది.
అదే ప్రాసెసర్.. అదే కెమెరాలు
Redmi 17Cలో MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 6nm ప్రాసెస్‌పై తయారైన ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 2.4GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్‌తో పాటు 12GB వరకు మెమరీ ఎక్స్‌టెన్షన్ సపోర్ట్ ఉంది.
కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా ఉంది. దీనికి f/1.8 అపర్చర్ లభిస్తుంది. పోర్ట్రెయిట్ ఫొటోల కోసం సహాయక లెన్స్‌ను అందించారు. సెల్ఫీల కోసం 8MP f/2.0 కెమెరా ఉంది.
6,000mAh బ్యాటరీ
ఫోన్‌లో భారీ 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 10W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా Android 16 ఆధారిత HyperOS 3పై ఫోన్ పనిచేస్తుంది.
మొత్తంగా చూస్తే Redmi 17Cలో డిజైన్ మినహా పెద్దగా కొత్తదనం కనిపించదు. అయితే బడ్జెట్ విభాగంలో ఇతర కంపెనీలు ఫీచర్లను తగ్గిస్తున్న సమయంలో పాత హార్డ్‌వేర్‌ను కొనసాగించడం కొంతమంది వినియోగదారులకు ప్లస్ పాయింట్ కావచ్చు. అయితే రూ.20,999 ప్రారంభ ధర కారణంగా ఇది ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది పోటీ ఫోన్లతో పోల్చిన తర్వాతే స్పష్టమవుతుంది. పెరుగుతున్న మెమరీ ధరల కారణంగా భవిష్యత్తులో ఈ ఫోన్ ధర మరింత పెరిగే అవకాశం కూడా ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.