Vande Bharat Sleeper : మనదేశంలో అత్యంత చవకైన రవాణా వ్యవస్థగా రైల్వే శాఖకు పేరు ఉంది. ఆంగ్లేయుల కాలం నుంచి మనదేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పాటు అయింది. అప్పటినుంచి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది. ప్రతి ఏడాది ప్రయాణికులు పెరుగుతూ ఉండడం.. ప్రయాణికులు ప్రీమియం సౌకర్యాలు కోరుకుంటున్న నేపథ్యంలో.. రైల్వే శాఖ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది.
మొన్నటిదాకా వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్ లు అందుబాటులో ఉండేవి కాదు. ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు పెరిగిపోవడంతో రైల్వే శాఖ భారీగా వెచ్చించి.. సుదూర రాత్రి ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ కోచ్ లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త వెర్షన్లో ప్రయాణికులకు అత్యద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఒక రకంగా స్లీపర్ కోచ్ లను పట్టాల మీద నడిచే ఫైవ్ స్టార్ హోటల్ అని చెప్పవచ్చు.
వందే భారత్ స్లీపర్ కోచ్ కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. అందులో ఉన్న సౌకర్యాలు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇది ఒక లగ్జరీ హోటల్ లాగా ఉందని.. అద్భుతమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు . ఆ వీడియోలో ఉన్న దృశ్యాలను చూస్తుంటే ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన.. ప్రైవేట్ క్యాబిన్ ఉంది. అందులో లైటింగ్.. ప్రీమియం ఫినిషింగ్.. విశాలవంతమైన స్థలం అద్భుతంగా ఉన్నాయి.
ప్రస్తుతం వందే భారత్ రైళ్లల్లో చైర్ కార్ ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి. కొత్తగా స్లీపర్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులకు ఈ కోచ్ అత్యంత సుఖవంతమైన నిద్ర వసతి అందిస్తుంది. అంతేకాదు ఫస్ట్ ఏసీ కోచ్ లలో విశాలవంతమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. క్యాబిన్ క్రమబద్ధంగా.. సౌకర్యవంతంగా ఉంది.
అదిరిపోయే స్థాయిలో సౌకర్యాలు
ఇందులో విలాసవంతమైన క్యాబిన్ సీట్లు ఉన్నాయి. రాత్రి ప్రయాణం కోసం విలాసవంతమైన నిద్రపోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి.
దుర్వాసనతో కూడిన టాయిలెట్లు కాకుండా.. హోటల్ తరహాలోనే టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇవి బయో విధానంలో పనిచేస్తూ ఉంటాయి.
ప్రయాణికుల కోసం అత్యాధునికమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శించడానికి అత్యంత ఆధునికమైన డిస్ప్లే స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది వందే భారత్ స్లీపర్ సర్వీస్ జనవరి నెలలో హౌరా నుంచి కామాఖ్య మధ్య మొదలైంది. ప్రస్తుతం ఇందులో 16 కోచ్ లు ఉన్నాయి. వాటిల్లో 11 ఏసి త్రీ టైర్.. 4 ఏసి టూ టైర్.. ఒకటి ఏసీ ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. 823 మంది ప్రయాణించే సామర్థ్యం ఈ రైలు సొంతం. అయితే భవిష్యత్తు కాలంలో కోచ్ ల సంఖ్యను 24కు పెంచే అవకాశం ఉంది. ఈ రైలు గంటకు 160 నుంచి 108 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి కవచ్ అనే పేరుతో యాంటీ కొలిజెంట్ టెక్నాలజీ వాడారు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు.. బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు.. సెన్సార్ ట్యాప్ లు.. రీడింగ్ లైట్లు.. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్.. ఫస్ట్ ఏసీలో అయితే హాట్ వాటర్ షవర్ సౌకర్యం కూడా ఉంది.