Homeజాతీయ వార్తలుIndian Railways: ఆ స్టేషన్లలో నీళ్లు తాగితే అంతే.. కడిగి పారేసిన కాగ్‌!

Indian Railways: ఆ స్టేషన్లలో నీళ్లు తాగితే అంతే.. కడిగి పారేసిన కాగ్‌!

Indian Railways: రైల్వే.. భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ. శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న భారత రైల్వే ప్రపంచంలో టాప్‌ 5 స్థానాల్లో ఉంటుంది. నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ రైల్వే.. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. ప్రయాణికుల కోసం ఆధునిక వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టింది. కానీ, కనీసం స్వచ్ఛమైన తాగునీరు మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. ఈ విషయంలో ఇండియన్‌ రైల్వేను కాగ్‌ కడిగిపారేసింది. దేశవ్యాప్తంగా […]

Indian Railways: రైల్వే.. భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ. శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న భారత రైల్వే ప్రపంచంలో టాప్‌ 5 స్థానాల్లో ఉంటుంది. నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ రైల్వే.. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. ప్రయాణికుల కోసం ఆధునిక వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టింది. కానీ, కనీసం స్వచ్ఛమైన తాగునీరు మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. ఈ విషయంలో ఇండియన్‌ రైల్వేను కాగ్‌ కడిగిపారేసింది. దేశవ్యాప్తంగా 512 రైల్వే స్టేషన్లపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నిర్వహించిన తనిఖీ ఫలితాలు ప్రయాణికుల సౌకర్యాలపై తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేశాయి. అత్యధిక శాతం స్టేషన్లలో ప్రయాణికుల కనీస అవసరాలు తీరకపోవడం, ముఖ్యంగా తాగునీటి నాణ్యత, పారిశుధ్యం, దివ్యాంగుల సౌకర్యాలు వంటి అంశాల్లో లోపాలు ఉన్నట్లు వెల్లడైంది.

ప్రాథమిక సదుపాయాల కొరత..
తనిఖీల్లో 89 శాతం స్టేషన్లలో కనీసం ఒకటైనా ముఖ్యమైన సౌకర్యం లోపించినట్లు తేలింది. కేవలం కొన్ని పదుల స్టేషన్లు మాత్రమే కనీస ప్రమాణాలను నెరవేర్చినట్లు గుర్తించింది. తాగునీటి కుళాయిలు, టాయిలెట్లు, కూర్చునే ఏర్పాట్లు, ప్లాట్‌ఫామ్‌ షెల్టర్లు వంటివి అనేక చోట్ల సరిపడా లేవు. 2018లో రైల్వే బోర్డు జారీ చేసిన ఆదేశాలు ఏడేళ్లు గడిచినా పూర్తిగా అమలు కాలేదు. న్యూఢిల్లీ, హౌరా, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్‌ వంటి ప్రధాన స్టేషన్లు కూడా ఈ జాబితాలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజూ లక్షల మంది సందర్శించే, అధిక ఆదాయం సమకూర్చే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉండటం ప్రశ్నార్థకం.

తాగునీటి నాణ్యతపై ఆందోళన..
క్రమం తప్పకుండా నీటి పరీక్షలు జరగకపోవడం కీలక సమస్యగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో క్లోరిన్‌ స్థాయిలు ప్రమాణాలకు అనుగుణంగా లేవు. అనేక స్టేషన్ల నుంచి సేకరించిన నమూనాల్లో ఇ.కోలి, కోలిఫామ్‌ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించింది. ఇవి విరేచనాలు, ఆహార విషప్రభావం, కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. కోయంబత్తూరు, పాలక్కడ్, హైదరాబాద్, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ వంటి చోట్ల వాటర్‌ కూలర్లలోనూ ఇటువంటి కలుషితం కనిపించింది. ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు ఇది ప్రత్యక్ష ముప్పు.

దివ్యాంగులు, సాధారణ ప్రయాణికుల ఇబ్బందులు
ర్యాంపులు, ప్రత్యేక టాయిలెట్లు, తగిన నీటి ఏర్పాట్లు, సీటింగ్‌ వ్యవస్థ లేకపోవడం దివ్యాంగుల ప్రయాణాన్ని కష్టతరం చేస్తోంది. ప్లాట్‌ఫామ్‌ షెల్టర్లు, కప్పబడిన నడకదారులు లేని చోట్ల ఎండ, వర్షం సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెయిటింగ్‌ రూములు కూడా కొన్ని స్టేషన్లలో లేవు. అత్యవసర వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం మరో ప్రమాదకర అంశం. ఏదైనా అనూహ్య పరిస్థితి ఏర్పడితే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

నిధుల వినియోగంలో లోపాలు
పరిశుభ్రత కోసం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ అనేక స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు, టాయిలెట్లు, నీటి బూత్‌లు మురికిగా ఉన్నాయి. వీధి కుక్కల సంచారం, పాన్‌ మరకలు, కొన్ని చోట్ల బహిరంగ మలవిసర్జన కూడా కనిపించాయి. ప్రయాణీకుల సౌకర్యాల బడ్జెట్‌లో గణనీయమైన మొత్తం ఖర్చు కాకుండా మిగిలిపోయింది. అనేక ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి ఆలస్యమయ్యాయి. నిధుల కొరత లేకపోయినా అమలులోని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రైల్వే శాఖ స్పందన..
నివేదికను సమీక్షించిన రైల్వే మంత్రిత్వ శాఖ సురక్షితమైన తాగునీటి కోసం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. బోర్డు స్థాయి నుంచి పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. కాగ్‌ సూచనల ప్రకారం అన్ని స్టేషన్లలో కనీస సౌకర్యాలు నిర్ణీత గడువులోగా కల్పించడం, దివ్యాంగుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం, నీటి పరీక్షలను క్రమబద్ధం చేయడం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, జవాబుదారీ వ్యవస్థను బలోపేతం చేయడం అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper