Vande Bharat Sleeper Train: ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో కోరుతున్నట్టుగా త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. విశాఖ నుంచి బెంగళూరుకు అందుబాటులోకి రానుంది. ఈ రైలుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక డాక్యుమెంట్ వైరల్ అవుతుండడం విశేషం. అంతేకాదు ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు నడిచే రూట్, ఏ స్టేషన్లలో ఆగుతుందో కూడా చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఏపీలో ఈ కొత్త వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలేకపోతున్నట్లు తెలుస్తోంది. విశాఖ టు బెంగళూరు మార్గం లో ఇది అందుబాటులోకి రానుందని.. రైల్వే బోర్డు నుంచి రైలుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చినట్లు కూడా జోరుగా ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే ఏపీ ప్రజలకు ఇదో అరుదైన అవకాశం.
* దక్షిణ కోస్తా పరిధిలో..
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. పలు కొత్త రైళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ఈ స్లీపర్ రైలును రంగంలోకి దించనున్నారు. ఇప్పటికే అధికారులు కొసరత్తు మొదలుపెట్టారు. రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేశారని తెలుస్తోంది. రైల్వే బోర్డు నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డిఆర్ఎమ్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ వందే భారత్ స్లీపర్ ఒక్క సోమవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో అందుబాటులో ఉండనుంది అని తెలుస్తోంది.
* టైమింగ్స్ పై విస్తృత ప్రచారం..
మరోవైపు ఈ రైలు టైమింగ్స్ పై కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగుతోంది. ప్రతిరోజు రాత్రి 8 15 గంటలకు బయలుదేరి దువ్వాడకు 8:45కు చేరుకుంటుందని.. కృష్ణ కెనాల్ కు అర్ధరాత్రి 1.05 గంటలకు, నంద్యాలకు తెల్లవారుజామున 4:45 గంటలకు, ధర్మవరానికి 7:30 గంటలకు, బెంగళూరుకు ఉదయం 10 గంటలకు చేరుకుంటుందని తెలుస్తోంది.. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులో రాత్రి 8 గంటలకు.. ధర్మవరానికి 10:30 గంటలకు, నంద్యాలకు అర్ధరాత్రి 1:02 గంటలకు, కృష్ణ కెనాల్ కు తెల్లవారుజామున నాలుగు 55 గంటలకు, దువ్వాడకు 9:15 గంటలకు.. విశాఖకు ఉదయం 10 గంటలకు వస్తుందని చెబుతున్నారు. సాధారణ రైళ్లు విశాఖ నుంచి బెంగళూరుకు 18 నుంచి 20 గంటల్లో చేరుతుండగా.. ఈ వందే భారత్ స్లీపర్ రైలు 14 గంటల వ్యవధిలో చేరుకోనుంది. అయితే దీనిపై రైల్వే శాఖ ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.